
ముంబయి: శివసేన నేత ఆదిత్య ఠాక్రే ఆదివారం ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలకు కఠినమైన భద్రత కల్పించడాన్ని ఆయన ప్రశ్నించారు. సమీపంలోని ఓ లగ్జరీ హోటల్ నుంచి అసెంబ్లీకి రావడానికి వారికి కట్టుదిట్టమైన భద్రత ఇచ్చారు. ఇదే విషయాన్ని శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే ఎత్తిచూపారు.
ముంబయిలో ఈ స్థాయిలో సెక్యూరిటీ కవర్‌ను ఇది వరకు ఎప్పుడూ చూడలేదని ఆదిత్య ఠాక్రే అన్నారు. మీరు ఎందుకు అంతలా భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. ఎవరైనా మీ నుంచి పారిపోతున్నారా? అని అడిగారు. అంత భయం ఎందుకు అని అన్నారు. ముంబై పేలుళ్లలో ప్రధాన దోషి కసబ్‌కు కూడా ఈ స్థాయిలో భద్రత ఇవ్వలేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీకి కొత్త స్పీకర్ గా రాహుల్ నార్వేకర్ ఎంపికయ్యారు. బీజేపీ నుంచి బరిలో దిగిన ఆయనకు 164 ఓట్లు రాగా, శివసేన నుంచి ఎంవీఏ తరుఫున పోటీలో ఉన్న రాజన్ సాల్వీకి 107 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నిక బీజేపీ సహకారంతో కొత్తగా ఎన్నికైన సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో జరిగింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టారు. ఇద్దరు అభ్యర్థుల ఓట్ల లెక్కింపు హెడ్ కౌంటింగ్‌తో ప్రారంభమైంది. మొదట రాహుల్ నార్వేకర్ మద్దతుదారులు వారి పేర్లను నంబర్‌లతో చెప్పడం ప్రారంభించగా.. ఆయనకే అత్యధిక ఓట్లు వచ్చాయి.
ఈ ఎన్నికల్లో రాజ్ ఠాక్రేకు చెందిన MNS (మహారాష్ట్ర నవ నిర్మాణ సేన) పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్‌కు మద్దతు ఇవ్వగా, ఇద్దరు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అబూ అజ్మీ, రైస్ షేక్ ఓటింగ్‌లో అసలు ఓటింగ్ లోనే పాల్గొనలేదు. శివసేన ఎమ్మెల్యే యామిని యశ్వంత్ జాదవ్ ఓటింగ్ లో పాల్గొన్నప్పుడు.. ప్రతిపక్ష బెంచ్‌లోని శాసనసభ్యులు ‘‘ఈడీ, ఈడీ (ED-ED)’’ అంటూ నినాదాలు చేశారు. ఓటింగ్‌కు ముందు డిప్యూటీ స్పీకర్ ఆదేశాలతో సభ గేట్లన్నీ మూసేశారు. నేటి నుంచి ప్రారంభమైన రెండు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో రేపు ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. ఇందులో షిండే ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.