
ఈపీఎఫ్‌వో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. అధిక పింఛనుకు ఉమ్మడి దరఖాస్తు ఆప్షన్‌ను మరోసారి పొడిగింది. ఇందుకు గతంలో ఇచ్చిన గడువు ఇవాళ్టీతో ముగియనుండటంతో దానిని జూలై 11 వరకు పొడిగిస్తూ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఈపీఎఫ్‌వో పరిధిలోని వున్న ఉద్యోగులు, కార్మికులు వచ్చే నెల 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధిక పింఛనుకు గతంలో మే 3 వరకు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే వేతన జీవుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దానిని ఈపీఎఫ్‌వో జూన్ 26 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
టెక్నికల్ సమస్యలు, సర్వర్ మొరాయించడంత, సకాలంలో పింఛనుదారులు, కార్మికులు దరఖాస్తు చేసుకోకపోవడంతో అధిక ఫించను దరఖాస్తు గడువు పొడిగించాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందడంతో ఈపీఎఫ్‌వో ఇందుకు గడువును పొడిగించింది. తాజాగా అర్హులైన పింఛనుదారులు/సభ్యులు ఎదుర్కొంటున్న ఏవైనా ఇబ్బందులను తొలగించేందుకు 15 రోజుల చివరి అవకాశం ఇస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం, ఉద్యోగులు జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూలై 11, 2023 వరకు పొడిగించబడింది.
ఇప్పటివరకు 15 లక్షలకు పైగా దరఖాస్తుదారులు ఉన్నారని పలు నివేదికలు గతంలో సూచించాయి. కొందరు తమ ఆధార్ కార్డ్‌లలో మార్పులు చేసినప్పటికీ దరఖాస్తులను సమర్పించలేకపోయారు (తర్వాత వారి EPF UANకి లింక్ చేయబడింది).
మరోవైపు.. ఏప్రిల్ 1, 2023న, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) NPS నుండి డబ్బు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనలను మార్చింది. PFRDA ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో కొత్త నియమాలను అమలు చేయవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) కింద సభ్యులు తమ మొత్తం ఫండ్‌లో 60 శాతాన్ని క్రమపద్ధతిలో విత్ డ్రా చేయవచ్చు. ఇంతకు ముందు ఈ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండేది. PFRDAలో ఈ మార్పు లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ నిర్ణయం ఎన్‌పిఎస్‌ను ప్రజలకు అనుకూలంగా మార్చడంలో సహాయపడుతుంది.
.