
Prime Minister Narendra Modi: గుజరాత్‌లోని కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద భారత తొలి హోంమంత్రి, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఈ క్రమంలోనే మాట్లాడుతూ.. భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు శత్రువులు ప్రయత్నిస్తున్నారనీ, అలాంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశం గట్టిగా నిలబడాలని ప్రధాని సోమవారం అన్నారు. అలాగే, మోర్బీ వంతేన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
గుజరాత్‌లోని కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన అనంతరం ఆదివారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదం మోర్బీ వంతెన కూలిన ఘటనలో మరణించిన వారిని ప్రధాని గుర్తు చేసుకున్నారు. తాను కేవాడియాలో ఉన్నాననీ, మోర్బీ వంతేన కూలిన ఘటన దిగ్బ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించేందుకు దేశవ్యాప్తంగా బృందాలు కెవాడియాకు వచ్చాయనీ, అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.
గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై ఆదివారం సాయంత్రం వేలాడే వంతెన కూలి 140 మందికిపైగా మరణించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో నిమగ్నమైందని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. కాగా, సర్దార్ పటేల్ జయంతిని రాష్ట్రీయ ఏక్తా దివస్ / జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటారు. భారతదేశానికి, దాని ఐక్యత ఎన్నడూ బలవంతం కాదు, కానీ దాని ప్రత్యేకతగా ఉంటుందని మోడీ అన్నారు. "మన దేశపు ఈ ఐక్యత మన శత్రువులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ రోజు మాత్రమే కాదు, వేల సంవత్సరాల నుండి.. విదేశీ దాడి చేసే వారందరూ ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి వారు చేయాలనుకున్నదంతా చేశారు" అని అన్నారు.
ఆ సుధీర్ఘ కాలంలో వ్యాపించిన విషం నేడు కూడా దాని వల్ల దేశం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దేశ విభజన, శత్రువులు దాన్ని సద్వినియోగం చేసుకోవడం చూశామని ప్రధాని అన్నారు. "ఆ విచ్చిన్న శక్తులు ఇంకా ప్రబలంగా ఉన్నాయి. కులం, ప్రాంతం, భాష పేరుతో దేశ ప్రజలను కొట్లాడేలా చేయాలని చూస్తున్నాయి. ప్రజలు ఒకరికొకరు ఇమడలేని విధంగా చరిత్రను కూడా అందిస్తున్నారు" అని అన్నారు. ఈ శక్తులు మనకు బయటి నుండి తెలిసిన శత్రువులు మాత్రమే కాదు, చాలాసార్లు ఆ శక్తులు బానిస మనస్తత్వం రూపంలో మన వ్యవస్థలోకి ప్రవేశిస్తాయనీ, ఆ శక్తులు కొన్నిసార్లు మనకు స్వార్థపూరిత ఉద్దేశపూర్వంగా, అవినీతి, బుజ్జగింపుగా, బంధుప్రీతిగా, దురాశగా కనిపిస్తాయని మనం గమనించాలని" ప్రధాని మోడీ అన్నారు. ఈ దేశ పుత్రుడిగా వారికి సమాధానం చెప్పాలి.. మనం ఒక్కటిగా ఉండాలని మోడీ అన్నారు.
"భారతదేశ సమగ్రతకు సర్దార్ పటేల్ వంటి నాయకులు నాయకత్వం వహించకపోతే పరిస్థితిని ఊహించడం కష్టం. 550 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేయకపోతే ఏమి జరిగేది?.." అని ప్రధాని అన్నారు. సర్దార్ పటేల్ జయంతి, ఏక్తా దివస్ కేవలం క్యాలెండర్‌లోని తేదీలు మాత్రమే కాదని, అవి భారతదేశ సాంస్కృతిక బలానికి సంబంధించిన గొప్ప వేడుకలని అన్నారు. ఈ సందర్భంగా వివిధ పోలీసు బలగాలతో కూడిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కవాతు నిర్వహించారు.