ఆ ఏనుగు అనుకోకుండా పైనాపిల్ తిన్నది..కేంద్ర పర్యావరణ శాఖ

By telugu news teamFirst Published Jun 8, 2020, 2:28 PM IST
Highlights

అంతేకాకుండా పొలాల్లోకి జంతువులు రాకుండా స్థానికులు చట్టానికి విరుద్ధంగా పేలుడు పదార్థాలతో నిండిన పండ్లను అమర్చినట్లు తాము గుర్తించామని కేంద్రం పేర్కొంది.

ఇటీవల కొద్ది రోజుల క్రితం కేరళలో ఓ గర్బంతో ఉన్న ఏనుగు పైనాపిల్ తిని మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఏనుగు మృతి సంఘటన అందరినీ కలవరపరిచింది. పైనాపిల్ లో బాంబులు పెట్టి ఏనుగును చంపిన వారిని శిక్షించాలంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. కాగా.. ఆ ఏనుగు అనుకోకుండానే బాంబుతో ఉన్న పైనాపిల్‌ను తిన్నదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.

‘‘ఏనుగు అనుకోకుండా పైనాపిల్ పండును తిన్నదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేరళ ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నాం. ఏనుగుల మరణంపై ఏ అధికారి అయినా వెంటనే చర్యలు తీసుకోవాలి. నేరస్థులను కూడా వెంటనే అరెస్టు చేయాలి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని పినరయ్ సర్కార్‌కు కేంద్రం సూచించింది.

అంతేకాకుండా పొలాల్లోకి జంతువులు రాకుండా స్థానికులు చట్టానికి విరుద్ధంగా పేలుడు పదార్థాలతో నిండిన పండ్లను అమర్చినట్లు తాము గుర్తించామని కేంద్రం పేర్కొంది. ఏనుగు మరణించిన సంఘటనలో మాత్రం ప్రస్తుతానికి ఒకరిని అరెస్టు చేశామని, ఈ అమానవీయమైన చర్యలో పాల్గొన్న మరికొంత మందిని గుర్తించి, అరెస్టు చేసే పనిలోనే ఉన్నామని అధికారులు తెలిపారు. 

మరోవైపు ఈ ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధపు ప్రచారాలను ఎంతమాత్రమూ నమ్మవద్దని, కేరళ ప్రభుత్వం నేరస్థులను గుర్తించే పనిలోనే ఉందని కేంద్రమంత్రి బబుల్ సుప్రియో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

click me!