
అన్నాడీఎంకేలో సంక్షోభానికి ఇంకా తెరపడటం లేదు. జయలలిత మరణం తర్వాత పార్టీ సారథ్య బాధ్యతల కోసం పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాల మధ్య పోరు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో విషయం కోర్టుల వరకు వెళ్లింది. తాజాగా పన్నీర్ సెల్వానికి మరో షాక్ తగిలింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా మాజీ సీఎం పళనిస్వామి నియామకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. అంతేకాదు.. రెండాకుల గుర్తును కూడా పళనిస్వామే దక్కించుకున్నారు. ఈసీ నిర్ణయంతో ఓపీఎస్ వర్గం షాక్‌కు గురైంది. పళనిస్వామి నియామకానికి సంబంధించి ఈసీ పంపిన నోట్‌అను ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి ఆర్ఎం బాబీ మురగవేల్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. దీనితో పాటు పార్టీలో చేసిన మార్పులు, కొత్త ఆఫీస్ బేరర్ల నియామకానికి సైతం ఈసీ ఆమోదం తెలిపింది.
కాగా. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానంతరం నుంచి (2016).. ఆ పార్టీ ద్వంద్వ నాయకత్వాన్ని అనుసరిస్తోంది. కానీ, పళనిస్వామి మాత్రం పార్టీలో ఏక నాయకత్వానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరువర్గాలు పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం మాత్రం శూన్యం.
Also REad: సుప్రీంలో పన్నీరు సెల్వంకు షాక్: మద్రాస్ హైకోర్టు తీర్పు సమర్ధన
అన్నాడిఎంకె లో పట్టు కోసం మాజీ ముఖ్యమంత్రులు పన్నీరు సెల్వం, పళనిస్వామిల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతుంది. అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి విషయమై రెండు వర్గాలు కోర్టులను ఆశ్రయించాయి. దీనిలో భాగంగా గతంలో మద్రాస్ హైకోర్టు పళనిస్వామికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో పన్నీరు సెల్వం సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సర్వోన్నత న్యాయస్థానం పళనిస్వామియే అన్నాడిఎంకె కు సింగిల్ నాయకుడు అంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో తేల్చి చెప్పింది.