గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు ఎల్ సిసి.. భారత ప్రధాని మోడీ ఆహ్వానం

By Mahesh KFirst Published Nov 27, 2022, 2:19 PM IST
Highlights

వచ్చే ఏడాది జనవరి 26న నిర్వహించనున్న భారత గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఇటీవలే ఈజిప్టు పర్యటనలో ఉన్నప్పుడు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ మేరకు ఆహ్వానాన్ని అందించినట్టు ఓ ప్రకటన వెల్లడించింది.
 

న్యూఢిల్లీ: ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి హాజరుకాబోతున్నారు. కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదివారం వెల్లడించింది. గత నెల కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈజిప్టు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిసిని భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా భారత  ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు.

భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఈజిప్టు అధినేత హాజరుకావడం ఇదే ప్రథమం కానుంది. ఉభయ దేశాల మధ్య దశాబ్దాల బలమైన బంధం ఉన్నది. 1961లో అలీనోద్యమంలో ఈ రెండూ వ్యవస్థాప సభ్య దేశాలు కావడం గమనార్హం.

‘ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్టు అధ్యక్షుడు హెచ్ఈ అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి 2023 జనవరి 26న గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్టుగా హాజరు అవుతారు’ అన కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. భారత్, ఈజిప్టు దేశాలు నాగరికత ఆధారంగా సన్నిహిత ప్రజా సంబంధాలను కలిగి ఉన్నదని ఆ వివరించింది. ఈ రెండు దేశాలూ ద్వైపాక్షిక సంబంధాలు మొదలు పెట్టి 75వ సంవత్సరాలు ఈ ఏడాదితో గడుస్తున్నాయి.

Also Read: 73rd republic day: ఈ సారి బీటింగ్ రీట్రీట్‌‌ మరింత ప్రత్యేకంగా .. ఒకేసారి 1000 డ్రోన్లతో వెలుగుల షో

వచ్చే జీ 20 సదస్సును భారత్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భారత అధ్యక్షతలో జరిగే ఈ సదస్సుకు ఈజిప్టు గెస్టు కంట్రీగా హాజరుకాబోతున్నట్టు ఆ ప్రకటన తెలిపింది. 

గణతంత్ర వేడుకలకు ఇతర దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించే ఆనవాయితీని భారత్ పాటిస్తున్నది. అయితే, కరోనా కారణంగా 2022, 2021 సంవత్సరాల్లో గణతంత్ర వేడుకలకు విదేశాల నుంచి ముఖ్యఅతిథులను ఆహ్వానించలేదు. అంతకు ముందు సంవత్సరం భారత గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బాల్సొనారో హాజరైన సంగతి తెలిసిందే. 

click me!