రూ. 100 కోట్ల పోంజీ స్కామ్ కేసులో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఈడీ సమన్లు పంపింది. ప్రణవ్ జువెల్లర్స్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కింద ప్రజల నుంచి సుమారు రూ. 100 కోట్లు సేకరించి.. తిరిగి ఇవ్వలేదని ఈడీ పేర్కొంది.
తిరువనంతపురం: ప్రముఖ నటుడు, రాజకీయ కార్యకర్త ప్రకాశ్ రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపింది. రూ. 100 కోట్ల పోంజీ, ఫ్రాడ్ కేసుకు సంబంధించిన కేసులో ఆయనకు సమన్లు అందాయి. తిరుచిరాపల్లికి చెందిన ప్రణవ్ జువెల్లర్స్ పై కేసు ఫైల్ అయింది. ప్రకాశ్ రాజ్ ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వచ్చే వారం చెన్నైలో ఈడీ ముందు హాజరు కావాలని ప్రకాశ్ రాజ్‌కు సమన్లు పంపింది. ఈ కేసులో విస్తృత స్థాయిలో దర్యాప్తు కోసమే ప్రకాశ్ రాజ్‌కు సమన్లు పంపినట్టు ఈడీ సూత్రప్రాయంగా తెలిపింది.
ప్రణవ్ జువెల్లర్స్ గ్రూప్, మరికొందరు అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు పాల్పడినట్టుగా అనుమానం ఉన్నవారిపై ఎకనామిక్ అఫెన్స్ వింగ్ తిరుచిలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఈ ఎఫ్ఐఆర్‌ని ఆధారంగా చేసుకుని ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ నెల 20వ తేదీన ప్రణవ్ జువెల్లర్స్ పై రైడ్ చేసింది. వివరణ ఇవ్వని సుమారు రూ. 23.70 లక్షల నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది. తాజాగా, ప్రకాశ్ రాజ్‌కు సమన్లు పంపింది.
Also Read: Pawan Kalyan: రైట్ లీడర్ లెఫ్ట్ జపం?.. ఖమ్మంలో కమ్యూనిజం మంత్రం.. పవన్ కళ్యాణ్ భావజలాల గందరగోళం
గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అని నమ్మించి ప్రజల నుంచి రూ. 100 కోట్లును ప్రణవ్ జువెల్లర్స్ సేకరించిందని ఈడీ బుధవారం తెలిపింది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టినవారికి పెద్ద మొత్తంలో డబ్బులు తిరిగి వస్తాయని మోసం చేసిందని పేర్కొంది. అయితే, వారికి లాభాలతోపాటు వారు పెట్టుబడి పెట్టిన మొత్తాలనూ తిరిగి ఇవ్వలేదని వివరించింది. దీంతో ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టినవారంతా మోసపోయారని తెలిపింది.