చైనా లోన్ యాప్‌లపై ఈడీ కొరడా.. గేట్‌వే ఖాతాల్లో దాచిన రూ. 46 కోట్లు ఫ్రీజ్

By Mahesh KFirst Published Sep 16, 2022, 2:23 PM IST
Highlights

నాగాలాండ్‌లో సైబర్ క్రైమ్ యూనిట్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా చైనా లోన్ యాప్‌లపై ఈడీ కొరడా ఝుళిపించింది. ఈ నెల 14వ తేదీ నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ లోన్ యాప్‌లకు సంబంధించిన కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. రూ. 46.67 కోట్ల ఫండ్ వర్చువల్ ఖాతాల్లో ఉంచినట్టు గుర్తించింది. వాటిని ఫ్రీజ్ చేసినట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.
 

న్యూఢిల్లీ: చైనీయులు నియంత్రణలో నడుస్తున్న లోన్ యాప్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ టోకెన్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝుళిపించింది. ఈజ్‌బజ్, రేజర్ పే, క్యాష్ ఫ్రీ, పేటీఎం గేట్‌వే ఖాతాల్లో ఉంచిన రూ. 46.67 కోట్ల డబ్బును ఫ్రీజ్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద ఈ డబ్బులను ఫ్రీజ్ చేసింది. ఈ మేరకు ఈడీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ఈడీ తనిఖీలు ప్రారంభించింది. ఢిల్లీ, ముంబయి, ఘజియాబాద్, లక్నో, గయాలోని నిందితులపై తనిఖీలు చేసింది. 

ఢిల్లీ, గురుగ్రామ్, ముంబయి, చెన్నై, హైదరాబాద్, జైపూర్, జోధ్‌పూర్, బెంగళూరుల్లోని కొన్ని బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేల కార్యాలయాల్లో సెర్చ్ చేపట్టింది. హెచ్‌పీజెడ్, ఇతర సంబంధ యాప్ బేస్డ్ కార్యాలయాలపై దాడులు చేసింది. నాగాలాండ్‌లోని కోహిమా పోలీసుల సైబర్ క్రైమ్ యూనిట్ 2021 అక్టోబర్‌లో ఓ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ చైనీస్ కంట్రోల్డ్ లోన్ యాప్‌లపై దర్యాప్తు ప్రారంభించింది.

ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో నేరపూరిత డాక్యుమెంట్లు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు ఈడీ వెల్లడించింది.

పేమెంట్ గేట్‌వేల వర్చువల్ ఖాతాల్లో ఈ లోన్ సంబంధీకులు పెద్ద మొత్తంలో డబ్బును ఉంచుతున్నట్టు తెలియవచ్చిందని ఈడీ వివరించింది. పూణెలోని ఈజ్‌బజ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 33.36 కోట్లు, బెంగళూరులోని రేజర్ పే సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 8.21 కోట్లు, బెంగళూరులోని క్యాష్ ఫ్రీ పేమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 1.28 కోట్లు, న్యూఢిల్లీలోని పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌లో రూ. 1.11 కోట్ల ఫండ్ స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది.

పలు బ్యాంకు ఖాతాలు, వర్చువల్ అకౌంట్‌లలో రూ. 46.67 కోట్ల ఫండ్ గుర్తించామని, వాటిని ఫ్రీజ్ చేశామని ఈడీ తెలిపింది.

click me!