
Economic Survey 2025 key points: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (జనవరి 31, శుక్రవారం) పార్లమెంటులో 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ GDP (Gross Domestic Product) వృద్ధి 6.3% నుండి 6.8% వరకు ఉండవచ్చని ఈ సర్వే తేల్చింది.. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించడానికి కనీసం ఒకటి నుండి రెండు దశాబ్దాల పాటు 8% వృద్ధి అవసరమని సర్వే అంచనా వేసింది.
ఇంకా ఈ సర్వేలో దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించి అనేక విషయాలను పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం మౌళిసదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో 5,853 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇలా దేశ అభివృద్ది కోసం మోదీ సర్కార్ భారీగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు ఆర్ధిక సర్వే ద్వారా ప్రజలకు తెలియజేసారు.
1. 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి వృద్ధి 6.3% నుండి 6.8% వరకు ఉండవచ్చు.
2. ఆర్థిక సర్వే GST వసూళ్లలో 11% వృద్ధిని అంచనా వేసింది, ఇది 10.62 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుంది.
3. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రీటైల్ ద్రవ్యోల్బణం 5.4%గా ఉంది, ఇది ఏప్రిల్-డిసెంబర్ 2024లో 4.9%కి తగ్గింది.
4. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించడానికి కనీసం రెండు దశాబ్దాల పాటు 8% వృద్ధి అవసరమని సర్వే పేర్కొంది.
5. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో సేవా రంగం 7.1% వృద్ధిని నమోదు చేసింది. జూలై-నవంబర్ 2024లో కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం 8.2% పెరిగింది ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.
6. 2025-2026 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో మంచి రబీ దిగుబడి కారణంగా ఆహార ధరలు నియంత్రణలో ఉంటాయని అంచనా.
7. వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడి తగ్గిన కారణంగా సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడి ఆహార ధరలు పెరిగాయి. అయితే 2024-2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నారు.
8. గత 7 సంవత్సరాలలో కార్మిక మార్కెట్ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగిత రేటు 3.2%కి తగ్గింది.
9. విదేశీ పెట్టుబడులను పెంచడానికి భారతదేశం అన్ని చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాలి.
10. భవిష్యత్తులో యువత మానసిక ఆరోగ్యమే ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది.