bengal bypoll: బీజేపీకి ఆదిలోనే షాక్.. అభ్యర్థి ప్రియాంకకు ఎన్నికల సంఘం నోటీసులు

By telugu teamFirst Published Sep 15, 2021, 6:56 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఆదిలోనే షాక్ తగిలింది. బీజేపీ అభ్యర్థి ప్రియాంక తబ్రేవాల్ తన నామినేషన్ వేస్తున్నప్పుడు ఎన్నికల కోడ్, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఎన్నికల సంఘం ఆమెకు నోటీసులు పంపింది. ఆమె తదుపరి ర్యాలీలను ఎందుకు అనుమతించాలో వివరించాలని, బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు సమాధానం రావాలని ఆదేశించింది.
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో భాగంగా సీఎం మమతా బెనర్జీపై భవానీపూర్ నుంచి పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి ప్రియాంక తబ్రేవాల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. నామినేషన్ వేస్తున్నప్పుడు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. ఆమె తదుపరి ర్యాలీలను ఎందుకు అనుమతించాలనే ప్రశ్నకు సమాధానమివ్వాల్సిందిగా ఆదేశించింది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా సమాధానమివ్వాలని తెలిపింది. 

సోమవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కోసం ఆమె వెంటే నందిగ్రామ్ ఎమ్మెల్యే సువేందు అధికారి, ఎంపీ అర్జున్ సింగ్ పార్టీ సీనియర్ నేత దినేశ్ త్రివేది, యాక్టర్ రుద్రనీల్ ఘోష్, సహా పలువురు సౌత్ కోల్‌కతాలోని సర్వే బిల్డింగ్‌కు వెళ్లారు. నామినేషన్ వేసేటప్పుడు కొవిడ్ నిబంధనలు, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఈసీ పేర్కొంటూ నోటీసులు పంపింది.

పశ్చిమ బెంగాల్‌లో భవానీపూర్ సహా శంషేర్‌గంజ్, జంగిపూర్ సీట్ల నుంచి ఈ నెల 30న ఉపఎన్నికలు జరగనున్నాయి. భవానీపూర్ నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీ చేయనున్నారు. కాగా, ఆమె వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చాలని తబ్రేవాల్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సజల్ ఘోస్ లేఖ రాశారు. అసోంలో ఆమెపై దాఖలైన కేసులు, ఇతర నేరవివరాలను మమతా బెనర్జీ సమర్పించలేదని ఆరోపించారు. కాబట్టి, ఆమె నామినేషన్‌ను అనర్హమైనదిగా ప్రకటించి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాల్సిందిగా అభ్యర్థించారు.

click me!