
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతు నేత, భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేశ్ తికాయత్.. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై సంచలన ఆరోపణలు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ ఒక జట్టు అని ఆరోపించారు. రైతులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని తెలిపింది. బీజేపీకి అసదుద్దీన్ ఒవైసీ చాచా జాన్ అని అన్నారు.
‘ఒవైసీ, బీజేపీలు ఒకే జట్టు. ఆయన బీజేపీకి చాచా జాన్. అసదుద్దీన్‌కు బీజేపీ ఆశీర్వాదాలున్నాయి. అందుకే బీజేపీని అసదుద్దీన్ ఒవైసీ దూషించినా కేసు ఫైల్ చేయరు. అసద్ సహాయాన్ని బీజేపీ తీసుకుంటుంది. అందుకే రైతులు వారి నిర్ణయాలను క్షుణ్ణంగా గమనించాలి. ఒవైసీకి రెండు ముఖాలున్నాయి. ఆయన రైతులను నాశనం చేయగలరు. ఎన్నికల సమయంలో వారు కుట్రలు చేస్తారు. కానీ, జిల్లా పంచాయతీ ఎన్నికల ద్వారా బాగ్‌పాట్ ప్రజలు మార్పు కోరుకునేవారని అర్థమవుతున్నది’ అని రాకేశ్ తికాయత్ అన్నారు.
అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద మూడు చట్టాలను వెనక్కి తీసుకునేవరకు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే వరకు తమ ఆందోళన ఆగదని రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కార్పొరేట్లే శాసిస్తున్నారని, ఇప్పుడు ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళన చేయరాదని, కనీసం సంఘాలు ఏర్పాటు చేసుకోవద్దన్న నిబంధనలు కేంద్రం తెచ్చిందని విమర్శించారు.
రాకేశ్ తికాయత్ ఆరోపణలను ఏఐఎంఐఎం ఉత్తరప్రదేశ్ చీఫ్ షౌకత్ అలీ తిప్పికొట్టారు. రాకేశ్ తికాయత్ షార్ట్‌కట్‌లను వినియోగించి రాజకీయ నాయకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. గత ఎన్నికల్లో రాకేశ్ తికాయతే బీజేపీకి మద్దతునిచ్చారని, ఇప్పుడు ఆ పార్టీ సూచనల మేరకే అసదుద్దీన్ ఒవైసీని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.