ఎన్నికల ర్యాలీలపై నిషేధం 31వ తేదీ వరకు పొడిగింపు.. 1వ, 2వ విడతలకు సడలింపులు

By Mahesh KFirst Published Jan 22, 2022, 7:33 PM IST
Highlights

ఎన్నికల ర్యాలీలపై నిషేధాన్ని ఈసీ ఈ నెలాఖరు వరకు పొడిగించింది. అయితే, మొదటి, రెండో విడత ఎన్నికల కోసం సడలింపులు ఇచ్చింది. తొలి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ నెల 28వ నుంచి రెండో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పబ్లిక్ మీటింగులు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చింది. వీటికి తోడు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్‌కు వ్యక్తుల సంఖ్యను ఐదు నుంచి పదికి పెంచింది.
 

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం పోల్ ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధాన్ని ఎన్నికల సంఘం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ నెల 31వ తేదీ వరకు ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం కొనసాగుతుంది. అయితే, తొలి రెండు విడతల్లో జరిగే ఎన్నికలకు మాత్రం కొన్ని సడలింపులను ఇచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఎన్నికల సంఘం ఎన్నికల ర్యాలీలపై విధించిన నిషేధంపై నిర్ణయం తీసుకోవడానికి సమావేశాన్ని నిర్వహించింది.

తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 10వ తేదీ, రెండో విడత ఫిబ్రవరి 14వ తేదీన జరగనున్నాయి. ఈ రెండు ఎన్నికల విడతల కోసం ఎన్నికల సంఘ ఈ నిషేధం నుంచి సడలింపులను ఇచ్చింది. తొలి విడత ఎన్నికల కోసం జనవరి 28వ తేదీ నుంచి, రెండో విడత ఎన్నికల కోసం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ సడలింపులు అమల్లోకి రానున్నాయి. తొలి విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు జనవరి 28వ తేదీ నుంచి పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు. రెండో విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పిబ్రవరి 1వ తేదీ నుంచి పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు. 

తొలి విడతలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా జనవరి 27వ తేదీన ఖరారవుతుంది. కాబట్టి, వీరికి పబ్లిక్ మీటింగ్స్‌కు 28వ తేదీ నుంచి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మీటింగులు కూడా నిర్దేశిత బహిరంగ ప్రదేశాల్లో గరిష్టంగా 500 మందితో నిర్వహించుకోవచ్చు. లేదా ఆ గ్రౌండ్ కెపాసిటీలో 50 శాతం మందితో నిర్వహించుకోవచ్చు. లేదా ఆ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిర్దేశించిన మందితో జరుపుకోవాలి. ఇందులో ఏది కనిష్టమైతే.. అదే అమలు అవుతుంది. ఈ మీటింగులు జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు నిర్వహించుకోవచ్చు. కాగా, రెండో విడత కోసం అభ్యర్థులు ఈ నెల 31వ తేదీన ఖరారు అవుతారు. వారు ప్రచారం చేసుకోవడానికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అనుమతనిచ్చింది. 

దీనికితోడు అలాగే, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కోసం వ్యక్తుల సంఖ్యను ఐదు నుంచి పదికి పెంచింది. వీడియో వ్యాన్‌లను వీక్షంచే ప్రజల సంఖ్య పరిమితినీ పెంచింది. కరోనా ముందు జాగ్రత్తలు పాటించాలనే నిబంధనలతో నిర్దేశిత బహిరంగ ప్రదేశాల్లో వీబడియో వ్యాన్‌ల ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం వెల్లడించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని తొలుత ఈ నెల 15వ తేదీ వరకు ప్రకటించింది. అదే సమయంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడానికి కార్యకర్తల సంఖ్యను ఐదు వరకే పరిమితం చేసింది. 15వ తేదీన నిషేధ నిర్ణయాన్ని సమీక్షిస్తామని తెలిపింది. అదే విధంగా ఈ నెల 15వ తేదీన నిషేధంపై ఈసీ సమీక్షించింది. ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధాన్ని మరో వారం పాటు పొడిగించింది. అంటే ఈ నెల 22వ తేదీ వరకు ఈ నిషేధాన్ని ప్రకటించింది. అదే సమయంలో బహిరంగ సభ కాకుండా.. ఇండోర్ మీటింగ్ నిర్వహించవచ్చని తెలిపింది. ఇండోర్ మీటింగ్‌లో 300 మందికి లేదా హాల్ సామర్థ్యంలో సగం మేరకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సమీక్షిస్తామని తెలిపింది.

మొత్తం 7 దశల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయని సీఈసీ వెల్లడించింది.

click me!