
earthquake in four states : దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు కొంత ఆందోళనకు గురయ్యారు. మేఘాలయలోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు రాగా.. గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో కూడా భూమి కంపించింది. అయితే ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టమూ జరిగినట్టు సమాచారం లేదు.
మేఘాలయ రాజధాని షిల్లాంగ్, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.8గా నమోదు అయ్యింది. ఉదయం 8.46 గంటలకు ఈ ప్రకంపనలు వచ్చాయి. వీటి వల్ల ఎలాంటి నష్టమూ సంభవించలేదు. నగరానికి నైరుతి దిశలోని మావ్ ఫలాంగ్ ప్రాంతంలో 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అదికారులు తెలిపారు.
అలాగే గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లాలో ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 9 గంటలకు సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.9గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 23.45 అక్షాంశం, 70.42 రేఖాంశంలో ఉందని, 20 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని ఎన్సీఎస్ పేర్కొంది.
నేటి ఉదయం 10 గంటల ప్రాంతంలో కర్ణాటకలోని విజయపుర జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.1గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అలాగే చెన్నై సమీపంలోని చెంగల్పట్టు జిల్లాలో శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 3.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. ఉదయం 7:39 గంటలకు వచ్చిన ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది.