
ఉత్తరాఖండ్‌లోని టెహ్రీలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతో భూకంపం సంభవించినట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం.. ఉత్తరకాశీకి తూర్పు-ఆగ్నేయంగా 17 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనాలు సంభవించాయి. ఉదయం 8.33 గంటలకు భూకంపం సంభవించినట్టుగా ఎన్‌సీఎస్ పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఎన్‌సీఎస్ పోస్టు కూడా చేసింది.
ఇక, భూకంప కేంద్రం తెహ్రీ జిల్లాలో ఉంది. అయితే రుద్రప్రయాగ్, డెహ్రాడూన్ జిల్లాల్లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. 3 సెకన్ల పాటు భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. భూప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భయందోళనకు గురైన ప్రజలు చాలా సేపు ఇళ్లలోకి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో ఇంతకుముందు ఆగస్టు, మే, ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లో భూకంపాలు సంభవించాయి.