పెరోల్‌లో ఉన్నది నకిలీ డేరా బాబా.. నిజమైన బాబాను చంపేసి ఉండొచ్చంటూ పిటిషన్.. హైకోర్టు ఏమన్నదంటే?

By Mahesh KFirst Published Jul 4, 2022, 5:53 PM IST
Highlights

పెరోల్‌పై విడుదలైన డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ భాగ్‌పాట్ ఆశ్రమానికి వెళ్లాడు.  ఈ ఆశ్రమానికి వచ్చిన రామ్ రహీమ్ గొంతు వేరుగా ఉన్నదని, ఆయన నిజమైన రామ్ రహీమ్ కాదని కొందరు భక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. నిజమైన డేరా చీఫ్‌పై ఆందోళనలు వ్యక్తం చేశారు.  ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా? అంటూ హైకోర్టు మండిపడింది.
 

న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పలు నేరపూరిత కేసుల్లో దోషిగా తేలిన సంగతి తెలిసిందే. పలు కేసుల్లో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, ఆయన పెరోల్‌పై బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ డేరా బాబా భక్తులు పంజాబ్ హర్యానా హైకోర్టులో పిటిషన్లు వేశారు. పెరోల్‌లో బయటికి వచ్చింది నిజమైన గుర్మీత్ రామ్ రహీమ్ కాదని ఆరోపించారు. ఆయన డమ్మీ అని పేర్కొన్నారు. ఎందుకంటే.. ఆయన ఒక అంగుళం ఎక్కువ ఎత్తు ఉన్నాడని, చేతి వేళ్లు కూడా పొడుగయ్యాయని, గొంతు మారిందని పేర్కొంటూ ఆయన అసలు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కాదని పిటిషన్ వేశారు. అంతేకాదు, నిజమైన గుర్మీత్ రామ్ రహీమ్‌కు ప్రాణ హానీ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే గుర్మీత్ రామ్ రహీమ్ మరణించి ఉండొచ్చని లేదంటే.. మరికొంత కాలంలో చంపేయవచ్చని తెలిపారు. ఈ పిటిషన్‌లో విషయాలపై పంజాబ్ హర్యానా హైకోర్టు సీరియస్ అయింది. ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? అంటూ మండిపడింది.

చండీగడ్, పంచకుల, అంబాలలకు చెందిన కొందరు డేరా బాబా భక్తులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. పెరోల్‌పై విడుదలై ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పాట్ ఆశ్రమానికి వచ్చిన రామ్ రహీమ్‌పై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. భాగ్‌పాట్ ఆశ్రమానికి వచ్చిన రామ్ రహీమ్‌లో అనేక మార్పులు కనిపించాయని వివరించారు. డేరా బాబా ఎత్తు ఒక అంగుళం పెరిగిందని, చేతి వేళ్లు, పాదాలు కూడా పొడుగ్గా కనిపించాయని పేర్కొన్నారు. ఆయన కొన్ని రోజుల క్రితం కొంత మంది పూర్వ స్నేహితులను కలిశాడని, కానీ, వారిని ఆయన గుర్తు పట్టలేకపోయాడని ఆరోపించారు. ఈ విషయాలను బట్టి చూస్తే భాగ్‌పాట్ ఆశ్రమానికి పెరోల్‌పై విడుదలై వచ్చిన డేరా చీఫ్ ఫేక్ అని తెలుస్తున్నదని పేర్కొన్నారు. ఆయన నకిలీ వ్యక్తి అని ఆరోపించడమే కాదు.. నిజమైన డేరా చీఫ్‌పై ఆందోళన చెందారు. నిజమైన డేరా చీఫ్‌ను కిడ్నాప్ చేసి ఉండొచ్చని ఆరోపించారు. ఆయన ఇది వరకే హత్యకు గురై ఉంటాడని, లేదంటే త్వరలోనే హత్యకు గురవుతాడేమోనని పేర్కొన్నారు. 

కాగా, డేరా సచ్చా సౌదా మేనేజ్‌మెంట్ ఈ పిటిషన్‌లో పేర్కొన్న విషయాలను కొట్టిపారేసింది. అవన్నీ భక్తులను తప్పుదారి పట్టించే కుట్రలు అని పేర్కొంది.

కాగా, ఈ పిటిషన్ పై పంజాబ్ హర్యానా హైకోర్టు సీరియస్ అయింది. ఈ పిటిషన్ వేసినవారు బహుశా కల్పిత సినిమాలు చూసి ఉండొచ్చని పేర్కొంది. ఇదేమీ సినిమా కాదని పిటిషన్‌పై ఆగ్రహించింది. హైకోర్టు ఇలాంటి కేసులు విచారించడానికి లేదని తెలిపింది. అసలు మీరు ఏదో ఫిక్షనల్ సినిమా చూసినట్టు ఉన్నదని వివరించింది. 

పెరోల్‌లో ఉన్న రామ్ రహిమ్ ఎలా అదృశ్యం అవుతాడని తెలిపింది. పిటిషనర్లు.. పిటిషన్ దాఖలు చేసేటప్పుడు కొంత బుర్ర వాడాలని మండిపడింది.

click me!