పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భారీ స్కామ్.. అదనపు డీజీ అమ్రిత్ పాల్ అరెస్ట్..

By Sumanth KanukulaFirst Published Jul 4, 2022, 5:19 PM IST
Highlights

పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన స్కామ్‌లో ఓ పోలీసు ఉన్నతాధికారం ప్రయేమం ఉన్నట్టుగా తేలడం తీవ్ర కలకలం రేపింది. దీంతో అతడిని విచారించిన సీఐడీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు.

పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన స్కామ్‌లో ఓ పోలీసు ఉన్నతాధికారం ప్రయేమం ఉన్నట్టుగా తేలడం తీవ్ర కలకలం రేపింది. దీంతో అతడిని విచారించిన సీఐడీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ హోదాలో ఉన్న ఐపీఎస్‌ అధికారి అమ్రిత్ పాల్.. కర్ణాటక పోలీస్ రిక్రూట్‌మెంట్ సెల్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. 545 సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామకం కోసం 2021  అక్టోబర్‌లో  police sub-inspector  రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహించబడింది. రాష్ట్రవ్యాప్తంగా 93 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 54,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఈ పరీక్ష ఫలితాలను ప్రకటించారు. 

అయితే పరీక్షా కేంద్రాల కేటాయింపులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, టాప్‌ ర్యాంకులు దక్కించుకునేందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఫలితాలను రద్దు చేసిన ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో సీఐడీ విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. పోలీసు రిక్రూట్‌మెంట్ సెల్‌ కేంద్రంగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో స్కామ్‌ జరిగిందని విచారణలో తేలింది.

కొంతమంది అభ్యర్థులు వారికి అనువైన పరీక్షా కేంద్రాలకు కేటాయించడానికి సుమారు రూ. 50 లక్షలు చెల్లించారని.. వారిలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా.. అభ్యర్థులు సమాధానమిచ్చిన OMR  షీట్‌లు కూడా ట్యాంపరింగ్ చేయబడ్డాయని.. అవి బెంగళూరులోని రిక్రూట్‌మెంట్ సెల్‌లో స్వీకరించబడ్డాయని తేల్చారు. 

ఈ క్రమంలో మాల్ ప్రాక్టీస్, మధ్యవర్తుల సాయంతో ఓఎంఆర్‌ షీట్స్ ట్యాంపరింగ్‌కు పాల్పడి అగ్రశ్రేణి ర్యాంకులు సాధించిన కొందరితో పాటుగా మొత్తం 30 మందిని సీఐడీ అరెస్ట్ చేసింది. రిక్రూట్‌మెంట్ సెల్‌లో గత పదేళ్లుగా పనిచేస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శాంతరాజును కూడా సీఐడీ బృందం అరెస్ట్ చేసింది. అతడి వాంగ్మూలం ఆధారంగా సీఐడీ అధికారులు.. అమృత్ పాల్‌ను గత నాలుగు రోజులుగా విచారించారు. అయితే తాజాగా నేడు అతడిని అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు. 

click me!