
ముంబై : తాగితే ఒళ్ళూ పై తెలియదని అంటుంటారు.. అలా తాగి, ఆ మత్తులో వాగి.. చివరికి జైలు పాలయ్యాడు ఓ హంతకుడు. ముప్పై ఏళ్లుగా గుట్టుగా మనసులోనే దాచుకున్న రహస్యాన్ని మద్యం మత్తులో.. కక్కేశాడు. దీంతో.. మిస్టరీగా ఉన్న 30 ఏళ్ల క్రితం నాటి జంట హత్యల్లో అరెస్టై జైలు పాలయ్యాడు. ఇన్నేళ్లు తాగలేదా మరి? అంటే.. తాగాడు.. కానీ ఇన్నేళ్లుగా పట్టుబడలేదు.. ఇప్పుడేమవుతుందిలే అన్న అతివిశ్వాసం అతనితో అలా వాగించింది, ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. అవినాష్ పవార్ అనే వ్యక్తి తాగిన మత్తులో.. అతి విశ్వాసానికి పోయి 30 ఏళ్ల క్రితం తాను చేసిన జంట హత్యలు, దోపిడీల గురించి బయటపెట్టాడు.ఇంకేముంది.. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు. 30 ఏళ్లుగా మిస్టరీగా మారిన కేసు చిక్కుముడి విడిపోయింది. మద్యం మత్తు నిందితుడిని పట్టించింది.
వార్నీ.. ఆ ఐదు రోజులు మహిళల ఒంటిమీద నూలుపోగు ఉండదట.. ఎక్కడంటే...
1993 అక్టోబర్లో.. అవినాష్ పవార్ అనే వ్యక్తి.. ముంబైలోని లోనవాలాలో ఓ ఇంటిని దోచుకోవడానికి వెళ్లారు. ఇంటిని దోచుకుని వచ్చేస్తే ఒక దోపిడీ కేసు మాత్రమే ఉండేది. అలా చేయలేదు. ఆ ఇంటిలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరినీ చంపేశారు. ఆ సమయంలో పవార్ వయసు 19యేళ్లు. హత్యకు గురైన భర్త వయసు 55 ఏళ్లు కాగా, భార్య వయసు 50 ఏళ్లు. ఈ దోపిడీకి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అప్పుడే అరెస్టు చేశారు.
అవినాష్ పవార్ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఆ ఘటన తరువాత పవార్ పోలీసులకు చిక్కకుండా మాయమయ్యాడు. కన్నతల్లిని కూడా వదిలేసి ఢిల్లీకి పారిపోయాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చేరుకున్నాడు. అక్కడ తన పేరు మార్చుకున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. కొద్ది రోజులకు అక్కడి నుంచి కూడా పింప్రీ-చించ్ వాడు, అహ్మద్ నగర్ కు మాకాం మార్చాడు. అలా ప్లేసులు మారుస్తు చివరికి ముంబైలోని విక్రోలీలో వచ్చి చేరాడు.
అవినాష్ పవార్ మార్చుకున్న కొత్త పేరుతోనే ఆధార్ కార్డు తీసుకున్నాడు. అదే పేరు చెప్పి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. తన భార్యను రాజకీయాల్లోకి ప్రవేశపెట్టి ఆమె నాయకురాలిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంత జరుగుతున్నీ ఈ 30 ఏళ్లలో పవార్ ను పోలీసులు పట్టుకోలేక పోయారు. గుర్తించలేకపోయారు. పవార్ వయసు ఇప్పుడు 49 సంవత్సరాలు. ఈ 30 ఏళ్లలో తాను దొరకకుండా ఉండడానికి.. కన్నతల్లిని, కట్టుకున్న భార్యను కూడా కలవడానికి ఎప్పుడు వెళ్లలేదని తేలింది.
ఇటీవల కాలంలో ఇక తనను పోలీసులు పట్టుకోలేరన్న ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. దీంతో.. మద్యం తాగిన సమయంలో 30 ఏళ్ల క్రితం తాను చేసిన జంట హత్యలు, దోపిడీ గురించి బయట పెట్టాడు. అది విన్న సదరు వ్యక్తి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే వారు విక్రోలీలో పవార్ ను అరెస్ట్ చేశారు. లోనావాలాలో 30 ఏళ్ల క్రితం జరిగిన ఓ జంట హత్యల కేసులో అవినాష్ పవార్ నిందితుడు అని ముంబై క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజ్ తిలక్ రోషన్ తెలిపారు.
ఆ ఘటనకు జరగడానికి ముందు పవర్ బాధితుల ఇంటి దగ్గర్లోనే ఒక షాపు నడుపుతుండేవాడు. చనిపోయిన దంపతులు ఇద్దరు పవార్ కి తెలుసు. వారి దగ్గర నగదు ఉన్న సంగతి పవార్ కు తెలుసు కాబట్టే.. మరో ఇద్దరితో కలిసి ఇంటిని దోచుకోవాలని పవార్ పథకం వేశాడు. ఇంటిని దోచుకుని.. తనను గుర్తుపడతారన్న అనుమానంతో వారిద్దరినీ కూడా హత్య చేశారు. హత్య జరిగిన సమయంలోనే పవార్ తో పాటున్న ఇద్దర్ని అరెస్ట్ చేశాం. పవార్ మాత్రం దొరకలేదు. చివరికి ఇలా పట్టుకున్నాం.. అని తెలిపారు.