
విమానంలో తప్పతాగిన ఓ వ్యక్తి తన పక్కసీట్లోని వివాహితతో అమానుషంగా ప్రవర్తించాడు. ఆమె ముందే అసభ్యంగా ప్యాంటు విప్పేసి నానా హంగామా చేశాడు. అంతే కాదు ఆమె కూర్చున్న సీటుపై మూత్రం పోసి జుగుప్సాకరంగా వ్యవహరించాడు. ఇంత జరుగుతున్న విమానంలోని సిబ్బంది పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం అతన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేదని సదరు బాధితురాలి కూతురు ట్విట్టర్ లో తన ఆవేదనను తెలిపింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అమెరికాలోని జేఎఫ్ కెన్నెడీ విమానాశ్రయం నుండి ఓ మహిళా ప్రయాణికురాలు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ102 విమానంలో డిల్లీకి ఒంటరిగా బయలుదేరింది. అయితే ఆమె పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ముందే ప్యాంటు విప్పేసి సీటుపై మూత్రం పోశాడు. దీంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల మధ్య సదరు మహిళ ప్రయాణించాల్సి వచ్చింది.
ఈ ఘటన గురించి తెలుసుకున్న సదరు బాధితురాలి కూతురు ఈ అమానుషంపై ట్విట్టర్ ద్వారా ఎయిరిండియా కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించి కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా వెంటనే ఈ ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి పరిస్థితి మీ తల్లికి ఎదురవడం పట్ల చింతిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.