థర్డ్ వేవ్‌లో హాస్పిటల్ చేరికలు రెట్టింపు అవ్వొచ్చు: కేంద్ర ప్రభుత్వ డేటా

By Mahesh KFirst Published Jan 11, 2022, 6:34 AM IST
Highlights

ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ సోకితే.. ఆ వ్యాధి తీవ్రత తక్కువగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నా.. గతేడాది వచ్చి పోయిన సెకండ్ వేవ్ కంటే కూడా ప్రస్తుత థర్డ్ వేవ్‌తోనే ఎక్కువ ముప్పు అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సెకండ్ వేవ్‌లో హాస్పిటల్ అడ్మిట్లతో పోల్చితే.. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు కూడా అయ్యే అవకాశం ఉన్నదని వివరించింది.
 

న్యూఢిల్లీ: కరోనా కేసులు(Corona Cases) వేగంగా పెరుగుతున్నాయి. వారం వ్యవధిలోనే 20 వేలు, 30 వేల కేసుల నుంచి ఏకంగా లక్షన్నర మార్క్ దాటి కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. డెల్టా వేరియంట్(Delata Variant) కంటే కూడా వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) కారణంగా కేసులు భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తున్నది. అయితే, దక్షిణాఫ్రికాలో తొలిసారి కనిపించిన ఈ ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టా వేరియంట్‌తో పోల్చితే.. తీవ్రమైనదేమీ కాదనే అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరించవచ్చేమో కానీ.. దాని తీవ్రత స్వల్పంగా ఉంటుందని ఇది వరకే పలువురు నిపుణులు వెల్లడించారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ బలహీనమైనదనే భావనలో నుంచి బయటకు రావాలని ఇప్పుడు చాలా మంది నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సమాచారం అసలు ముప్పును వెల్లడిస్తున్నది.

ఈ థర్డ్ వేవ్‌లో భారత్‌లో హాస్పిటల్‌లో చేరుతున్నవారి శాతం ఐదు నుంచి 10 శాతంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, పరిస్థితులు అనూహ్యంగా ఉన్నాయని, హాస్పిటల్‌లో అడ్మిట్ కావాల్సిన అవసరాలూ పెరిగి పోవచ్చని హెచ్చరించింది. సెకండ్ వేవ్‌లో హాస్పిటల్‌లో చేరిన వారి సంఖ్య 20 నుంచి 23 శాతంగా ఉన్నదని వివరించింది. అయితే, గతేడాది వచ్చిన సెకండ్ వేవ్ కంటే కూడా ఇది పెద్ద వేవ్ అని తెలిపింది. సెకండ్ వేవ్ డెల్టా వేరియంట్ కారణంగా సంభవించగా, థర్డ్ వేవ్ వెనుక ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్టుగా ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. సెకండ్ వేవ్‌తో ప్రస్తుత పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం పోల్చుతూ కీలక విషయాలు వెల్లడించింది. అప్పుడు 100 డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూస్తే.. ఇప్పుడు వాటి స్థానంలో 400 నుంచి 500 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రిపోర్ట్ అయ్యే ముప్పు ఉన్నదని తెలిపింది. సెకండ్ వేవ్‌లో 100 కేసులు హాస్పిటల్‌లో అడ్మిట్ కావాల్సి వచ్చిందని భావిస్తే.. ఇప్పుడు 125 నుంచి 250 వరకు హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని వివరించింది.

మన దేశంలో ఒక్కసారిగా కేసులు అమాంతం పెరిగిపోవడానికి కారణంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌నూ పేర్కొంటూనే.. ఇప్పటికీ డెల్టా వేరియంట్ కూడా కొనసాగుతున్నదని ఆరోగ్య శాఖ సోమవారం వివరించింది. కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ సపోర్టు అవసరాలనూ సమకూర్చుకోవాలని తెలిపింది. వైద్య సిబ్బంది కొరతనూ అదిగమించడానికి సూచనలు చేసింది.

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,79,723 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ను విడుదల చేసింది. తాజాగా కరోనాతో 146 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,936కి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 46,569 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,45,00,172కి చేరింది. ఇక, ప్రస్తుతం దేశంలో 7,23,619 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

click me!