
చండీగడ్: సోషల్ యాక్టివిస్ట్, యాక్టర్ సోనూ సూద్(Sonu Sood) సోదరి Malvika Sood సస్పెన్స్‌కు తెరదించారు. గతేడాది నుంచి సాగుతున్న రాజకీయ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆప్‌లో చేరతారా? అకాలీదళ్‌లో చేరతారా? కాంగ్రెస్‌లో చేరతారా? అనే సంశయాలను తొలగించారు. తాజాగా, ఆమె కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. సోనూ సూద్ సోదరి మాల్వికా సూద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పంజాబ్‌లోని ఆమె తమ సొంత నియోజకవర్గం మోగా నుంచి బరిలోకి దిగనున్నారు. వచ్చే నెల 14వ తేదీన పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు(Punjab Assembly Election) ఒకే విడతలో జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. కరోనా కష్టకాలంలో సోనూ సూద్ సామాన్య ప్రజలకు అందించిన సేవలు దేశవ్యాప్తంగా ఆయనకు మంచి పేరు తెచ్చింది. సాధారణ ప్రజల్లో సోనూ సూద్ అంటే ఆరాధనా భావం పెరిగింది.
గతేడాది నవంబర్‌లోనే ఆయన మోగాలోని తమ నివాసంలో సోనూ సూద్ రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రావాలని భావించడం లేదని స్పష్టం చేశారు. అయితే, తన సోదరి మాల్వికా సూద్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతుందని వివరించారు. తాను తన సోదరిని బలపరుస్తానని చెప్పారు. అయితే, ఇప్పుడే ఏ పార్టీలో చేరుతందనే విషయం వెల్లడించలేమని అన్నారు. ఏ పార్టీలో చేరాలని ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు. ఈ ప్రకటనకు ముందే సోనూ సూద్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, అకాలీ దళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్, కాంగ్రెస్ నేతలనూ ఆయన కలిశారు. ఈ నేపథ్యంలోనే సోనూ సూద్ రాజకీయ ప్రవేశం చేస్తారని భావించారు.
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూ, సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు స్వయంగా మాల్వికా సూద్‌ను వారి నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. వారి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా ఒక పార్టీ చీఫ్, సీఎంలు ఇంటికి వచ్చి పార్టీలో చేర్చుకోవడం అనేది చాలా అరుదు అని నవజోత్ సింగ్ సిద్దూ అన్నారు. కానీ, ఆమె అందుకు అర్హురాలు అని.. అందుకే తాము వచ్చామని వివరించారు. ఆమె తమ పార్టీలోకి చేరడం ఒక గేమ్ చేంజర్ వంటి పరిణామం అని తెలిపారు.
శాసన సభా గడువు ముగుస్తున్న ఐదు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అసంబ్లీ ఎన్నికల నిర్వహణ నుంచి వెనుకడుగు వేయడం లేదని వివరించింది. నిన్ననే ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలన ప్రకటించింది. యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఏడు షెడ్యూల్‌లలో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఒక్క యూపీలో మాత్రమే ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కరోనా కేసుల నేపథ్యంలో జనవరి 15వ తేదీ వరకు ఎన్నికల ర్యాలీలపై నిషేధం విధించింది. ఆ తర్వాతే ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షిస్తామని తెలిపింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సింగిల్ ఫేజ్‌లో ఫిబ్రవరి 14న ముగియనున్నాయి.