Doda Accident : జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 30 మందికి పైగా మృతి

By Asianet News  |  First Published Nov 15, 2023, 1:59 PM IST

జమ్మూకాశ్మీర్ లోని దోడా జిల్లాలో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 30 మందికి పైగా మరణించారు. ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికుల ఉన్నారు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోడా జిల్లాలో ఓ బస్సు అదుపు తప్పి దాదాపు 300 అడుగుల లోయలో బుధవారం ఉదయం పడిపోయింది. ఈ ప్రమాదంలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

పోలీసులు, రెస్క్యూ బృందాలతో సహా స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య 30 లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చని దోడా పోలీసులు వెల్లడించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Many feared dead in Major road accident in Doda (JK) after bus carrying 40 passengers skidded off the road near Trungal - Assar and fell several metres downhill pic.twitter.com/4S6KXt31p9

— Weatherman Shubham (@shubhamtorres09)

Latest Videos

ప్రమాదానికి గురైన బస్సు 40 మంది ప్రయాణికులతో కిష్త్వార్ నుంచి జమ్మూ వైపు వెళ్తోంది. ఈ మార్గంలో ఓ బస్సును మరో బస్సు ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ట్రుంగల్-అస్సార్ సమీపంలో లోయలో పడిపోయింది. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

‘‘దోడాలోని అస్సార్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని డివ్ కామ్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మిన్ ను ఆదేశించాం’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఈ వారం దోడా జిల్లాలో జరిగిన రెండో ఘోర రోడ్డు ప్రమాదం ఇది. 

click me!