సిజేరియన్ చేసి కడుపులో టవల్ వదిలేసిన డాక్టర్లు.. కడుపునొప్పి రావడంతో...

By SumaBala BukkaFirst Published Jan 5, 2023, 9:04 AM IST
Highlights

మహిళ కడుపులో టవల్ వదిలేసిన ఘటనలో సమగ్ర విచారణకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) రాజీవ్ సింఘాల్ ఆదేశించారు.

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఆపరేషన్ చేసి కడుపులో కత్తులు, దూది, ప్లాస్టర్ లాంటివి వదిలేస్తారన్న ఘటనలు అక్కడక్కడా వింటుంటాం.. అలాంటి ఘటనే అమ్రోహాలో చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరిన మహిళకు సిజేరియన్ చేసి.. డెలివరీ చేసిన వైద్యులు.. ఆమె కడుపులో టవల్ ను వదిలేసి కుట్టేశారు. డెలివరీ తరువాత కడుపునొప్పితో బాధపడుతుండడంతో.. వేరే ఆస్పత్రికి వెడితే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసుపై సమగ్ర విచారణకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) రాజీవ్ సింఘాల్ ఆదేశించారు.

చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం, డాక్టర్ మత్లూబ్, అమ్రోహాలోని నౌగావానా సాదత్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైఫీ నర్సింగ్ హోమ్‌ అనే ఆస్పత్రిని నడుపుతున్నాడు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. అక్కడికే బాధితురాలు నజరానా అనే మహిళ ప్రసవం కోసం వచ్చింది. ఆమెకు ఆపరేషన్ చేసిన తర్వాత నజరానా కడుపులో టవల్‌ను అలాగే ఉంచేసి కుట్టువేసేశారు. 

ఇంటిముందు మూత్ర విసర్జన.. వద్దన్నందుకు తుపాకీతో కాల్పులు..ఒకరు మృతి...

సమాచారం ప్రకారం, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా టవల్ నజరానా కడుపులోనే ఉండిపోయింది. డెలివరీ తరువాత కడుపు నొప్పి గురించి మహిళ ఫిర్యాదు చేయడంతో, ఆమెను మరో ఐదు రోజులు హాస్పిటల్ లోనే ఉంచేశారు. బయట చలి కారణంగా ఆమెకు కడుపు నొప్పి వస్తుందని చెప్పారు. ఆ తరువాత ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చినా ఆరోగ్యం బాగోకపోవడంతో భర్త షంషేర్ అలీ ఆమెను అమ్రోహాలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వారు పరీక్షలు చేసి.. ఆమె కడుపులో ఏదో ఉందని దానివల్లే కడుపునొప్పి వస్తుందని తెలిపారు. వెంటనే మరో ఆపరేషన్ చేసి టవల్ తీసేశారు.

అది చూసిన భర్త షంషేర్ అలీ షాక్ అయ్యాడు. డెలివరీ కోసమన వెడితే... ఇంతటి దారుణానికి పాల్పడ్డారని.. సమయానికి తాము స్పందించకపోతే.. ప్రాణాపాయం వచ్చేది అంటూ.. సదరు ప్రైవేట్ డాక్టర్ మత్లూబ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అలీ సీఎంఓకు ఫిర్యాదు చేశాడు.  "ఈ సంఘటన గురించి నేను మీడియాలో కథనాలు రావడంతో నాకు తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని పరిశీలించమని నోడల్ అధికారి డాక్టర్ శరద్‌ను కోరాను. దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే మరిన్ని వివరాలు చెప్పగలం" అని సిఎంఓ సింఘాల్ మంగళవారం తెలిపారు.

అయితే, షంషేర్ అలీ ఈ వ్యవహారంపై ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు చేయలేదని, విచారణ జరుగుతుందని సీఎంవో హామీ ఇచ్చారు. సీఎంవో విచారణ నివేదిక రాగానే పోలీసులు విచారణ ప్రారంభిస్తారని పేర్కొనడం గమనార్హం.

click me!