
ఢిల్లీ : డాక్టర్ల పట్ల దురుసుగా ప్రవర్తించే రోగులు, వారి బంధువులకు వైద్యం నిరాకరించే అవకాశాన్ని వైద్యులకు కల్పిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ నియమావళి నిబంధనలను అమలులోకి తీసుకువస్తున్నారు. ఇటీవలి కాలంలో రోగులు, రోగి బంధువులు వైద్యులపై దాడులు చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎన్ఎంసిఆర్ఎంపీ తాజాగా ఈ నిబంధనలు అమల్లోకి తీసుకువస్తున్నట్లుగా తెలిపింది.
దీంతో ఇకపై వైద్యులతో అనుచితంగా ప్రవర్తించే రోగులకు చికిత్స చేయకుండా వైద్యులు నిరాకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. డాక్టర్ల మీద జరుగుతున్న హింసను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిబంధనలను అమలులోకి తీసుకు వస్తున్నట్లుగా ఎన్ఎంసిఆర్ఎంపీ పేర్కొంది. ఇకమీదట కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ 2002 స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన ఎన్ఎంసిఆర్ఎంపీ రెగ్యులేషన్ 2023 అమల్లోకి రానుంది.
చెన్నైలో పాఠశాల విద్యార్థినిపై దాడికి పాల్పడిన ఆవు యజమాని అరెస్ట్...
ఎన్ఎంసిఆర్ఎంపీ నిబంధనల ప్రకారం వైద్యులు రోగికి చికిత్స ప్రారంభించే ముందే కన్సల్టేషన్ ఫీజు లేదా చికిత్స ఫీజు గురించి తప్పనిసరిగా తెలియజేయాలని తెలిపింది. రోగికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారు? ఎంత ఫీజు అవుతుంది? అనే వివరాలను వైద్యులే తెలియజేయాల్సి ఉంటుంది. ముందుగా చెప్పిన ప్రకారం ఫీజు గనక చెల్లించకుంటే.. దరు వ్యక్తులకు చికిత్సను వైద్యులు నిరాకరించవచ్చని తెలిపింది.
అత్యవసర సేవల విషయంలో మాత్రం ఈ నిబంధన వర్తించదని పేర్కొంది. డాక్టర్ మీద రోగి, లేదా వారి బంధువులు దురుసుగా వ్యవహరిస్తున్నట్లయితే.. ఆ సందర్భంలో వారి ప్రవర్తన గురించి రికార్డులో రాయాలి. ఆ తర్వాత వేరేచోట చికిత్స చేయించుకునేలా వైద్యులు వారికి సూచించాలని తెలిపింది. ప్రాణాపాయ పరిస్థితుల్లో తప్ప.. తాము ఎవరికి చికిత్స ఇవ్వాలి అనే విషయంలో వైద్యుల, స్వీయ నిర్ణయంపై పూర్తిగా ఆధారపడి ఉంటుందని తెలిపింది.
రోగికి వైద్యం ప్రారంభించిన తర్వాత ఒకవేళ చికిత్స నిరాకరించాలనుకుంటే.. వైద్యులు రోగి బంధువులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అలా రోగి బంధువులకు సమాచారం ఇవ్వకుండా చికిత్స నిరాకరించకూడదని ఎన్ఎంసిఆర్ఎంపీ తెలిపింది దీంతోపాటు ప్రస్తుతం చికిత్స చేస్తున్న వైద్యుడితో పాటు అదనంగా మరో వైద్యుడి అవసరం కనుక ఉన్నట్లయితే ఆ విషయం గురించి కూడా రోగికి.. లేదా అతని కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా వైద్యులు సమాచారం అందించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇక మరో నిబంధన ప్రకారం వైద్యులు ఫార్మా సంస్థల నుంచి ఎలాంటి బహుమతులు, ప్రయాణ సౌకర్యాలు అదనంగా పొందొద్దని కూడా నిబంధనలో పేర్కొంది ఎన్ఎంసిఆర్ఎంపీ. ఫార్మా సంస్థలు నిర్వహించే విద్యాసంస్థల్లో జరిగే సెమినార్లు, వర్క్ షాపుల్లో వైద్యులు పాల్గొనకూడదని కూడా ఎన్ ఎం సి ఆర్ ఎంపీ తన నిబంధనలో పేర్కొంది.