ఇండోర్ లో డాక్టర్ మృతి: ఇండియాలో కరోనాతో మరణించిన తొలి డాక్టర్ ఇతనే

By telugu teamFirst Published Apr 9, 2020, 12:51 PM IST
Highlights

మధ్యప్రదేశ్ లో కరోనా వైరస్ బారిన పడి ఓ వైద్యుడు మరణించాడు. భారతదేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన తొలి వైద్యుడు ఇతనే. ఇండోర్ లో ఇప్పటి వరకు 22 మంది కరోనాతో మరణించారు.

ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. కోవిడ్ ృ19 సోకి ఓ వైద్యుడు మరణించాడు. భారతదేశంలో కరోనా వైరస్ తో డాక్టర్ మరణించడం ఇదే తొలిసారి. దీంతో ఇండోర్ కరోనా వైరస్ మృతుల సంఖ్య 22కు చేరుకోగా, పాజిటివ్ కేసుల సంఖ్య 213కు చేరుకుంది. 

మధ్యప్రదేశ్ లో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి సీల్ చేసిన మూడు ప్రాంతాల్లో ఇండోర్ ఒక్కటి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రంగా కరోనావ్యాప్తికి ఇండోర్ గురైంది. వచ్చే రోజుల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగవచ్చుననే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో 5,734కు చేరుకుంది.473 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 166కు చేరుకుంది. 

ఇదిలావుంటే, ఈ నెల 14ల తేదీన దేశంలో లాక్ డౌన్ ఎత్తేసే ఆలోచన లేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బుధవారంనాడు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడగించే ఆలోచనలోనే కేంద్రం ఉన్నట్లు కనిపిస్తోంది. 

లాక్ డౌన్ ను ఒకేసారి ఎత్తేయలేమని మోడీ చెప్పారు. కరోనా వైరస్ తర్వాత పరిస్థితులు మునుపటిలా సాధారణంగా ఉండవని ఆయన అన్నారు. కరోనాకు ముందు, కరోనా తర్వాత అనే పరిస్థితులుఉంటాయని ఆయన చెప్పారు. అయితే, ముఖ్యమంత్రులతో మరోసారి చర్చిస్తామని ఆయన చెప్పారు.  

లాక్ డౌన్ ఎత్తేయాలా, కొనసాగించాలా అనే విషయంపై శనివారం ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాతనే మోడీ తుది నిర్ణయం తీసుకోనున్నారు. శనివారం నాడు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అభిప్రాయాలను తీసుకుంటారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖ రావు సహా పలువురు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను కొనసాగించాలని అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ తప్ప మరోటి దేశాన్ని కరోనా వైరస్ లేదా కోవిడ్ 19 నుంచి రక్షించలేదని వారు అభిప్రాయపడుతున్నారు.

కరోనావైరస్ నానాటికీ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5,194కు చేరుకుంది. కొత్తగా 773 కేసులు నమోదయ్యాయి. దేశంలో మరో 35 మరణాలు సంభవించాయి. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ కుదుటపడడానికి, ప్రాథమిక రంగాలు తిరిగి పనిచేయడానికి వీలుగా లాక్ డౌన్ చర్యలు ఉండాలని భావిస్తోంది.

click me!