
చెన్నై : డీఎంకే బహిష్కృత నేత అళగిరి వరుస పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఏ కార్యక్రమం తలపెట్టినా అది విజయవంతం కావడం లేదు. కాలం కలిసి రావడం లేదో తమ్ముడి తెలివితేటల ముందు అతని ఆలోచనలు ఫెయిల్ అవుతున్నాయో తెలియదు కానీ ఆది నుంచి ఆయన వరుస అపజయాలను మూటకట్టుకుంటున్నారు. తాజాగా అళగిరి తలపెట్టిన శాంతి ర్యాలీ సైతం కార్యకర్తలు లేక బోసిపోయింది. దీంతో మరోసారి అళగిరికి పరాభవం తప్పలేదు.
అళగిరి డీఎంకే వ్యవస్థాప అధ్యక్షుడు కరుణానిధి పెద్ద కుమారుడు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ తండ్రి కరుణానిధి అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. తన రాజకీయ వారసుడిగా రెండో కుమారుడు స్టాలిన్ ను ప్రకటించారు. అంతేకాదు కనీసం తాను ఆరోగ్యంగా ఉన్నంత వరకు అళగిరిని దగ్గరకు కూడా రానియ్యలేదు కరుణానిధి. అయితే ఆస్పత్రులో అనారోగ్యంతో ఉన్నప్పుడు అళగిరి తండ్రి కరుణానిధిని చూసేందుకు వచ్చి కుటుంబ సభ్యులతోనూ పార్టీతోనూ సంబంధాలు పెంచుకోవడం ప్రారంభించారు.
కరుణానిధి మరణానంతరం అళగిరి పార్టీలో క్రియాశీలక స్థానంపై కన్నేశారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న స్టాలిన్ నూతన అధ్యక్షుడిగా పగ్గాలు చేపడతారని అంతా భావించిన సమయంలో అళగిరి డీఎంకే పార్టీ అధ్యక్ష పీఠం తనదేనంటూ ప్రకటించుకున్నారు. నిజమైన కార్యకర్తలంతా తనతోనే ఉన్నారన్నారు. దీంతో అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు మెుదలైంది.
అధ్యక్ష పీఠం నీదా నాదా అన్న కోణంలో ఇరువురు సై అంటే సై అన్నారు. కానీ స్టాలిన్ ఆలోచనల ముందు అళగిరి వెనుకపడ్డారు. గత నెల అధ్యక్ష పీఠం కోసం జరిగిన పోటీలో కనీసం నామినేషన్ కూడా వెయ్యలేకపోయారు అళగిరి. పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన స్టాలిన్ తనకు కేవలం సోదరి మాత్రమే ఉంది సోదరుడు లేరంటూ ప్రకటించడంంతో కంగుతిన్న అళగిరి తమ్ముడితో సయోధ్యకు ప్రయత్నించారు.
తనను పార్టీలోకి తీసుకుంటే తమ్ముడు స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తానని ప్రకటించుకున్నారు. అయినా స్టాలిన్ లో ఏ మార్పు కనిపించలేదు. తాజాగా తన రాజకీయ బలం నిరూపించేందుకు బుధవారం చెన్నై మహానగరంలో తలపెట్టిన శాంతి ర్యాలీ అట్టర్ ప్లాప్ అవ్వడంతో మళ్లీ కంగుతిన్నారు అళగిరి. పార్టీ కార్యకర్తలెవరు అళగిరి ర్యాలీలో పాల్గొనవద్దని పార్టీ చీఫ్ స్టాలిన్ కట్టడి చేయడంతో డీఎం కే కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనలేదు. దీంతో అళగిరి ర్యాలీ పేలవంగా సాగింది.
తమ్ముడితో ఢీకొంటే తన రాజకీయ భవిష్యత్ కష్టమని భావించిన అళగిరి మళ్లీ రాజీకి రెడీ అయ్యారు. శాంతి ర్యాలీ వేదికగా పార్టీ బలహీనంగా ఉంది. తనను చేర్చుకుంటే బలోపేతం అవుతుందంటూ రాయబారం పంపారు. అయితే స్టాలిన్ అన్న అళగిరిని అక్కున చేర్చుకుంటారా లేక కరుణానిధిలా దగ్గరకు కూడా రానియ్యరా అన్నది కాలమే నిర్ణయించాలి.