డీఎంకేకు డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సుబ్బులక్ష్మి జగదీశన్ రాజీనామా.. స్టాలిన్ గురించి ఏమన్నారంటే?

By Mahesh KFirst Published Sep 20, 2022, 2:01 PM IST
Highlights

డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సుబ్బులక్ష్మి జగదీశన్ పార్టీ పోస్టుకు, పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆగస్టు 29న రాజీనామా లేఖ అందించారు. కేవలం పార్టీ నుంచే కాదు.. క్రియాశీలక రాజకీయాల నుంచి ఆమె తప్పుకుంటున్నట్టు వెల్లడించారు.
 

చెన్నై: తమిళనాడు అధికార పార్టీ డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రెటరీ, కేంద్ర మాజీ మంత్రి సుబ్బులక్ష్మీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పోస్టుకు, అలాగే, పార్టీ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. తాను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. 

75 ఏళ్ల జగదీశన్ 2004 నుంచి 2009 వరకు తిరుచెంగోడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అదే కాలంలో ఆమె కేంద్రంలో మంత్రిగా సేవలు అందించారు. సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రిగా చేశారు. రాజీనామా గురించి ఆమె ఓ ప్రకటనలో వెల్లడించారు.

తన 40 ఏళ్ల యాక్టివ్ పాలిటిక్స్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెడుతున్నారని, క్రియాశీలక రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్టు వివరించారు. ఈ మేరకు తన రాజీనామా డీఎంకే పార్టీ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌కు ఆగస్టు 29వ తేదీన అందించానని తెలిపారు. డీఎంకే పార్టీ నుంచే కాదు.. యాక్టివ్ పాలిటిక్స్ నుంచి వైదొలుగుతున్నట్టు పేర్కొన్నారు.

2021లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించి.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఎంకే స్టాలిన్ గురించి ఆమె మాట్లాడారు. తమ ముఖ్యమంత్రి పార్టీ కోసం, రాష్ట్రం కోసం చేస్తున్న కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని, దీని పట్ల తాను సంతోషంగా ఉన్నట్టు వివరించారు.

2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె మొదకురిచి నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సీ సరస్వతి పై ఓడిపోయారు.

ఏఐఏడీఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చిన జగదీశన్ 1980లో డీఎంకేలో చేరారు. 1989 నుంచి 1991 మధ్యలో ఎం కరుణానిధి ప్రభుత్వంలోనూ మంత్రిగా చేశారు. 1977 నుంచి 1980 కాలంలో ఎంజీ రామచంద్రన్ ప్రభుత్వంలోనూ మంత్రిగా సేవలు అందించారు.

click me!