ఫెడరల్ ఫ్రంట్ లో చేరం, మీరే మా కూటమిలోకి రండి: కేసీఆర్ తో స్టాలిన్

By Nagaraju penumalaFirst Published May 13, 2019, 8:44 PM IST
Highlights

కేసీఆర్ ప్రతిపాదనలను స్టాలిన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. తాము కాంగ్రెస్, బీజేపీ యేతర కూటమిలో ఉన్నామని స్పష్టం చేశారు. అవకాశం ఉంటే తమరు కూడా బీజేపీ యేతర కూటమికి మద్దతు ఇవ్వాలని స్టాలిన్ కేసీఆర్ ను కోరినట్లు సమాచారం. 


చెన్నై: సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకోవడంతో జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పూర్తిస్థాయి మెజారిటీ వచ్చే అవకాశం లేదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఆ అవకాశాన్ని చేజిక్కుంచుకునేందుకు ప్రాంతీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. అందులో భాగంగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీ యేతర పక్షాలు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎవరికి వారు పలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. 

రాబోయే ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికలు ముగింపు దశకు చేరుకోవడంతో మరింత పదును పెట్టారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు కూడగట్టేందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. 

లోక్ సభ ఎన్నికల అనంతరం ఇటీవలే కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసి మద్దతు కోరారు. అనంతరం సోమవారం డీఎంకే చీఫ్ స్టాలిన్ ను కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సుమారు ఇరువురు నేతల మధ్య గంటన్నర పాటు చర్చ జరిగింది.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయాలపై కూలంకశంగా చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ వస్తే ప్రాంతీయ పార్టీలు మరింత బలం పుంజుకుంటాయని కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సమ సంబంధాలు మెరుగుపడతాయని రాష్ట్రాల హక్కుల కోసం గట్టిగా పోరాడదాం అంటూ కేసీఆర్ స్టాలిన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. 

కేసీఆర్ ప్రతిపాదనలను స్టాలిన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. తాము కాంగ్రెస్, బీజేపీ యేతర కూటమిలో ఉన్నామని స్పష్టం చేశారు. అవకాశం ఉంటే తమరు కూడా బీజేపీ యేతర కూటమికి మద్దతు ఇవ్వాలని స్టాలిన్ కేసీఆర్ ను కోరినట్లు సమాచారం. 

డీఎంకే పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయని అంతేకాకుండా తాము బీజేపీ యేతరకూటమికి మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారట. సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని మంత్రి చేసేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామని తేల్చి చెప్పారట. 

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తికి మద్దతిస్తామని, అయితే కాంగ్రెస్ విషయంలో తమ వైఖరి మారబోదని తేల్చిచెప్పినట్లు డీఎంకే వర్గాలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. 

ఆ దిశగా ఇప్పటికే పలు దశల వారీగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసిన విషయం తెలిసిందే. ఇకపోతే త్వరలోనే కర్ణాటక సీఎం కుమారస్వామితోనూ కేసీఆర్ కలిసే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఈ వార్తలు కూడా చదవండి

స్టాలిన్ హ్యాండ్ ఇచ్చారా...?: మీడియాతో మాట్లాడని కేసీఆర్

click me!