కమల్ ప్రకటన కరెక్టే, ఆర్ఎస్సెస్ ఉగ్రవాద సంస్థ: కాంగ్రెస్ నేత అళగిరి

By Nagaraju penumalaFirst Published May 13, 2019, 7:52 PM IST
Highlights

తమిళనాడు కాంగ్రెస్‌ చీఫ్‌ కేఎస్‌ అళగిరి ఆరెస్సెస్‌ను ఉగ్రవాద సంస్థ ఐఎస్‌తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ తరహాలో ఆర్ఎస్ఎస్ కూడా తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారిని ద్వేషిస్తోందని ఆరోపించారు. 

 
చెన్నై : సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా తమిళనాడు కాంగ్రెస్‌ చీఫ్‌ కేఎస్‌ అళగిరి ఆరెస్సెస్‌ను ఉగ్రవాద సంస్థ ఐఎస్‌తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ తరహాలో ఆర్ఎస్ఎస్ కూడా తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారిని ద్వేషిస్తోందని ఆరోపించారు. మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను ప్రస్తావిస్తూ దేశంలో తొలి ఉగ్రవాది హిందువేనని మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలను అళగిరి సమర్ధించారు. 

కమల్‌ హాసన్‌ ప్రకటనతో తాను నూరు శాతం కాదు వేయి శాతం ఏకీభవిస్తానని చెప్పుకొచ్చారు. తమ సిద్ధాంతంతో విభేదించేవారిని తుదముట్టించాలని అరబ్‌ దేశాల్లో ఐఎస్‌ తలపోసినట్టే భారత్‌లో ఆరెస్సెస్‌, జనసంఘ్‌, హిందూ మహాసభలు భావిస్తాయని ఆరోపించారు. 

అరబ్‌ దేశాల్లో తమ భావజాలంతో ఏకీభవించని వారు ముస్లింలే అయినా వారిని తుదముట్టించాలని అక్కడి అతివాదులు భావిస్తారని వ్యాఖ్యానించారన్నారు. ఇకపోతే తమిళనాడులోని అరవక్కురుచ్చిలో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న కమల్‌ హాసన్‌ స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది హిందువేనని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. 

click me!