
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి డీకే శివకుమార్ కనకపుర సీట్ నుంచి నామినేషన్ వేశారు. అనూహ్యంగా.. నామినేషన్ల గడువు ముగుస్తున్న సమయంలో ఆయన సోదరుడు డీకే సురేష్ కూడా అదే స్థానం నుంచి నామినేషన్ వేసి కొత్త చర్చను లేవదీశారు. డీకే శివకుమార్‌కు వ్యతిరేకంగా, ఆయనపై పోటీ కోసం సోదరుడు డీకే సురేశ్ నామినేషన్ వేయలేదు. చివరి క్షణంలో డీకే శివకుమార్ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడితే సోదరుడు సురేష్ కుమార్‌ను బరిలో నిలపడమే ఈ నామినేషన్ ఉద్దేశ్యమని చెబుతున్నారు.
డీకే సురేష్ బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తనకు లేదని ఆయన గతంలో చెప్పారు. అయితే, ఆయన రాష్ట్ర అసెంబ్లీ స్థానానికి అదీ.. సోదరుడు డీకే శివకుమార్ పోటీ చేస్తున్న స్థానంలోనే నామినేషన్ వేయడంపై చర్చనీయాంశమైంది.
Also Read: పన్నీర్ సెల్వానికి ఈసీ షాక్.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు
డీకే శివకుమార్ కర్ణాటకలో ఒక ప్రభావశీల, శక్తివంతమైన నాయకుడు. 2017 నుంచి ఆయన కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల తనిఖీలను ఎదుర్కొంటున్నారు. ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖలు మనీలాండరింగ్ ఆరోపణలు, పన్ను ఎగవేత కేసుల్లో ఆయనపై దర్యాప్తు చేస్తున్నాయి. ఒక వేళ ఈ కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల దర్యాప్తుల కారణంగా చివరి నిమిషంలో తాను పోటీకి అనర్హుడైన పక్షంలో తన సోదరుడిని అక్కడ తన తరఫు అభ్యర్థిగా నిలబెట్టాలనేది డీకే సురేశ్ నామినేషన్ వెనుక గల ఉద్దేశ్యం అని స్పష్టమవుతున్నది.
వొక్కలిగ కమ్యూనిటీ మెజార్టీగా ఉండే కనకపుర స్థానం డీకే శివకుమార్‌కు కంచుకోట వంటిది. ఆయన 1989 నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లోనైతే సుమారు 80 వేల ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగరేశారు.