దేశ అవినీతి రాజధానిగా కర్ణాటక.. దృష్టి మరల్చేందుకే హిజాబ్, ఈద్గా : బీజేపీపై డీకే శివకుమార్ విమర్శలు

By Siva KodatiFirst Published Sep 1, 2022, 2:30 PM IST
Highlights

కర్ణాటకలోని అధికార బీజేపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ అవినీతి రాజధానిగా కర్ణాటక మారిందని.. అందుకే బీజేపీ నేతలు హిజాబ్, హలాల్, ఈద్గా వంటి ఇష్యూలను తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. 

కర్ణాటకలో బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపై కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో దేశ అవినీతి రాజధానిగా కర్ణాటక మారిందని ఆయన ఆరోపించారు. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అధికార బీజేపీ రాష్ట్రంలో హిజాబ్, హలాల్, ఈద్గా వంటి ఇష్యూలను తెరపైకి తెస్తోందని డీకే శివకుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ప్రధాని మోడీకి కాంట్రాక్టర్లు లేఖ రాశారంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చన్నారు. 

ఇలా కాంట్రాక్టర్లు ప్రధానికి లేఖ రాయడం ఇది రెండోసారని.. కాంగ్రెస్ హయాంలో పది శాతం లంచాలు ఇస్తే, బీజేపీ ప్రభుత్వం అది 40 శాతానికి పెరిగిందని వారు తెలిపినట్లు డీకే వివరించారు. అలాగే విద్యా వ్యవస్థలోనూ అవినీతి రాజ్యమేలుతోందని.. విద్యా సంస్థల సర్టిఫికెట్ల రెన్యువల్, ఫైర్, సేఫ్టీ వంటి విషయాల కోసం భారీగా లంచాలు సమర్పించుకోవాల్సి వస్తోందని స్కూల్స్ అసోసియేషన్లు కూడా ప్రధానికి లేఖ రాశారని శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి పేద విద్యార్ధులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కూడా లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు. 
 

click me!