‘ధూమ్-4 Coming Soon’.. సినీ ఫక్కీలో చోరీ.. బ్లాక్ బోర్డుపై ఫోన్ నెంబర్లు రాసి మరీ దొంగతనం

By Mahesh KFirst Published Jul 4, 2022, 2:32 PM IST
Highlights

ఒడిశాలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఓ దొంగల ముఠా స్కూల్‌లో చొరబడి కంప్యూటర్లు, జిరాక్స్ మెషీనన్, ప్రింటర్, వెయింగ్ మెషీన్ సహా పలు వస్తువులను వారు దొంగిలించారు. వీటిని దొంగిలించిన చోరులు.. అక్కడే బ్లాక్ బోర్డుపై ధూమ్ -4 కమింగ్ సూన్ అని రాశారు. అంతేకాదు.. చేతైనేత పట్టుకోండని ఫోన్ నెంబర్లు రాశారు.

భువనేశ్వర్: బాలీవుడ్ సినిమా ధూమ్ సిరీస్ తెలుసు కదా..! అందులో లీడ్ రోల్స్ పోలీసు అధికారులకు చెప్పి మరీ చోరీ చేస్తారు. వారి కళ్లుగప్పి వారి సమక్షంలోనే దొంగతనం చేసి ప్రేక్షకులను రంజింపచేయడమే ఆ సిరీస్‌లో కీలక అంశం. అయితే.. అదంతా సినిమా. నిజ జీవితం వేరు. కానీ, ఒడిశాలో మాత్రం ధూమ్ సినిమా ప్రేరణతో ఓ ముఠా దొంగతనం చేసినట్టుగా కనిపిస్తున్నది.

‘ధూమ్-4 coming soon. ధూమ్-4 will return. మీకు చేతనైతే మమ్మల్ని పట్టుకోండి. మా మొబైల్ నెంబర్లు ఇవిగో.. ’ ఇదంతా ధూమ్ మూవీ సిరీస్ గురించి ప్రమోషన్ అనుకుంటున్నారా? అయితే.. తప్పులో కాలేసినట్టే. ఓ స్కూల్‌లో చోరీ చేసి ఆ ఆకతాయి దొంగలు బ్లాక్ బోర్డులపై రాసిన వాక్యాలు అవి.

వారికి అతివిశ్వాసమో లేక పోలీసులను తప్పుదారి పట్టించాలనే ఆలోచనలో కానీ.. ఈ రాతలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఘటన ఒడిశా జిల్లాలోని నబరంగ్ పూర్ జిల్లాలో ఆదివారం అంటే జులై 3వ తేదీన చోటుచేసుకుంది.

నబరంగ్ పూర్ జిల్లాలోని ఇంద్రావతి హై స్కూల్‌లో దొంగలు పడ్డారు. హెడ్ మాస్టర్ గది తలుపులూ పగులపొట్టారు. ఆ స్కూల్‌లోని కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫొటోకాపీయర్స్, వెయింగ్ మెషీన్, ఓ సౌండ్ బాక్స్‌ను దొంగలు పట్టుకెళ్లారు. 

ఈ చోరీ జరిగిన మరుసటి రోజు ఉదయం స్కూల్ ప్యూన్ ఎప్పట్లాగే పాఠశాలకు వెళ్లాడు. బడిలో అడుగు పెట్టగానే హెడ్ మాస్టర్ రూమ్ తలుపులు ధ్వంసం చేసి కనిపించాయి. స్కూల్‌లోని దాదాపు మొత్తం ఆఫీసు ఎక్విప్‌మెంట్ చోరీ అయిందని గ్రహించాడు. వెంటనే ఆ ప్యూన్ స్కూల్ అధికారులకు విషయం తెలిపారు. ఆ స్కూల్‌లోని బ్లాక్ బోర్డుపై ధూమ్-4 త్వరలో వస్తున్నాడు.. ధూమ్-4 మళ్లీ వస్తాడు.. మీకు చేతనైతే మమ్మల్ని వెతికి పట్టుకోండి అని రాతలు కనిపించాయి. అంతేకాదు, ఓ బ్లాక్ బోర్డుపై కొన్ని మొబైల్ నెంబర్లు కూడా రాసి వెళ్లారు. 

ఈ ఘటనపై నబరంగ్ పూర్ ఎస్పీ సుశ్రీ ఎస్ మాట్లాడుతూ, కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఇంద్రావతి హై స్కూల్ హెడ్‌మాస్టర్ సర్బేశ్వర్ బెహెరాల ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అనంతరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్పీ తెలిపారు.

ఓ పోలీసు బృందం, సైంటిఫిక్ స్క్వాడ్, స్నిఫరర్ డాగ్‌ను వెంటబెట్టుకుని స్పాట్ చేరుకున్నారు. 

click me!