డేరా బాబా బర్త్‌డే: పోస్టాఫీస్‌లో భక్తుల కోలాహలం

By telugu teamFirst Published Aug 20, 2021, 2:45 PM IST
Highlights

హర్యానాలోని వివాదాస్పద బాబా, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ 54వ జన్మదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది ఆయన భక్తులు పోస్టాఫీసులకు చేరి గ్రీటింగ్ కార్డులు, రాఖీలను పార్సిల్ చేస్తున్నారు. రోహతక్‌లోని సునేరియా జైలులో శిక్ష పొందుతున్న డేరా చీఫ్‌కు శుభాకాంక్షలు పంపిస్తున్నారు.
 

న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పాపులారిటీ అంతా ఇంతా కాదు. జైలులో ఉన్నప్పటికీ ఆయనపై అభిమానం వీసమంతైనా తగ్గలేదనిపిస్తున్నది. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని భక్తులు గ్రీటింగ్ కార్డులు, రాఖీలు పెద్దపెట్టున పంపిస్తున్నారు. వీటిని పార్సిల్ చేయడానికి పోస్టాఫీసులో పోటెత్తారు. గత 19 రోజుల్లో గుర్మీత్ రామ్ రహీమ్ కోసం 25వేల పార్సిళ్లను పంపారని ఓ పోస్టాఫీసు అధికారి వెల్లడించారు.

డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆగస్టు 15న జన్మించారు. ఈ నెల 22నే రాఖీ పౌర్ణమి. గుర్మీత్ భక్తులు ఆయన పుట్టిన ఆగస్టు నెల మొత్తాన్ని అవతార మాసంగా జరుపుకుంటారు. ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతున్నది. ప్రస్తుతం గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ రోహతక్‌లోని సునేరియా జైలులో ఉన్నారు. తన అనుచరులైన ఇద్దరు మహిళలపై ఆయన లైంగికదాడికి పాల్పడ్డ కేసులో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. 2017 ఆగస్టులో ఆయన శిక్ష ఖరారైంది.

సునేరియా జైలులోని గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు గ్రీటింగ్స్ పంపడానికి ఆయన భక్తులు, అనుచరులు హిసార్ పోస్టల్ డివిజన్‌లోని సిధాని సబ్ పోస్ట్ ఆఫీసులో పోటెత్తారు. ఆయన 54వ పుట్టిన రోజు కోసం ఎన్వలప్‌లు చేతబట్టుకుని క్యూలు కడుతున్నారని ఓ అధికారి వివరించారు. హర్యానా సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ రంజు ప్రసాద్ వీటిపై మాట్లాడుతూ, ఈ నెల 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ 2.95 లక్షల రాఖీలను గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు అందించడానికి స్వీకరించిందని తెలిపారు. గతేడాది ఈ సంఖ్య 2.78లక్షలుగా ఉన్నదని అన్నారు.

click me!