Covid-19: దేశరాజధానిలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నోయిడా, ఎన్సీఆర్ పరిధిలో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కోవిడ్-19 బారినపడటంపై ఆందోళన వ్యక్తంచేసిన అధికార యంత్రాంగం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Fourth wave scare: ప్రస్తుతం పలు దేశాల్లో కరోనా కల్లోలం రేపుతోంది. ఇక భారత్ లో కరోనా ప్రభావం తగ్గిపోయిందని అనుకుంటున్న తరుణంలో దేశరాజధానిలో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో ఒక్కరోజులోనే కోవిడ్ పాజిటివిటీ రేటు రెట్టింపు అయింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే దాదాపు 50 శాతం కొత్త కేసులు పెరిగాయి. బుధవారం నాడు ఢిల్లీలో 202 మందికి కరోనా కేసులు వెలుగులోకి రాగా.. గురువారం కొత్తగా 299 కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 0.5 శాతం నుంచి 2.70 శాతానికి పెరిగింది. రెండు రోజుల్లో 118 శాతం పెరిగింది. ముంబయి, ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,007 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,39,023 చేరగా, మరణాలు 5,21,737కు పెరిగాయి. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య 11,058(0.03 శాతం)గా ఉంది.
దేశం మొత్తంగా కరోనా ప్రభావం తగ్గినప్పటికీ.. ఎన్సీఆర్ పరిధిలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు.. ఢిల్లీ, నోయిడాల్లో వైరస్ బారిపడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్‌లో 15 మంది పిల్లలతో సహా నలభై నాలుగు మంది కోవిడ్ -19 బారినపడ్డారు. దీంతో జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 100 మార్క్‌ను దాటి ఇప్పుడు 121కి చేరుకుంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీకి గురువారం 68 నమూనాలను పంపుతున్నట్లు తెలిపారు.
కరోనా బారినపడుతున్న పిల్లలు, ఉపాధ్యాయులు పెరుగుతున్న తరుణంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. నోయిడా, గ్రేటర్ నోయిడాలోని అన్ని పాఠశాలలకు దగ్గు, జలుబు, జ్వరం, విరేచనాలు లేదా కోవిడ్ -19 ఏవైనా లక్షణాలు కనిపిస్తే సకాలంలో చికిత్స కోసం వెంటనే తెలియజేయాలని ఆరోగ్య శాఖ బుధవారం ఒక సలహాను జారీ చేసింది. "మీ పాఠశాలలో చదువుతున్న ఏ పిల్లలకైనా దగ్గు, జలుబు, జ్వరం, విరేచనాలు లేదా కోవిడ్-19 ఏదైనా లక్షణాలు ఉంటే, మీరు వెంటనే చీఫ్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయానికి హెల్ప్‌లైన్ నంబర్-1800492211 లేదా cmogbnr@gmail.com, ncmogbnr@gmail.com ఈ-మెయిల్ పంపండి" అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఢిల్లీలోనూ పలువురు విద్యార్థులు, టీచర్లకు కోవిడ్-19 సోకినట్టు గుర్తంచిన తర్వాత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తామని ప్రకటించింది. ముందుజాగ్రత్త చర్యగా, వైరస్ ఇతరులకు సోకకుండా మరియు మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి పాఠశాల యాజమాన్యం విద్యార్థులందరినీ సెలవుపై ఇంటికి పంపింది. కోవిడ్ -19 కేసులు స్వల్పంగా పెరగడం దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం త్వరలో పాఠశాలలకు మార్గదర్శకాలను జారీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం తెలిపారు. ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో కొంతమంది పాఠశాల విద్యార్థులు వైరస్‌కు పాజిటివ్ పరీక్షలు చేసినట్లు నివేదికల మధ్య ఆయన వ్యాఖ్యలు చేశారు. "కోవిడ్ కేసులు కొద్దిగా పెరిగాయి, కానీ ఆస్పత్రిలో పెరుగుదల లేదు, కాబట్టి మేము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండండి. కరోనాతో జీవించడం నేర్చుకోవాలి. మేము పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాము" అని సిసోడియా విలేకరులతో అన్నారు.