
న్యూఢిల్లీ: ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భార్య, ఇద్దరు పిల్లలను చంపేయడానికి కిచెన్‌లో ఉపయోగించే కత్తిని వాడుకున్నట్టు తెలిపారు. ఆ కత్తిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్టు తేలిందని వివరించారు. ఆ కత్తి ఇంటి వద్ద డెలివరీ అయినట్టు చెప్పారు.
ద్వారకాలోని విపిన్ గార్డెన్ వద్ద నివసిస్తున్న 38 ఏళ్ల రాజ్ కుమార్ దారుణానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు కొడుకులను కత్తితో హతమార్చాడు. వారి ముగ్గురిని చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. పోలీసు వర్గాల ప్రకారం, రాజ్ కుమార్ మూడు కత్తులతో ఆన్ లైన్ లో కొనుగోలు చేశాడు. గతవారం ఆన్ లైన్ షాపింగ్ చేశాడు. ఈ హత్యలు ప్రీప్లాన్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ తన భార్య, పిల్లలను హతమార్చడానికి ప్రయత్నించాడా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
రాజ్ కుమార్ భార్య, ఇద్దరు కొడుకుల డెడ్ బాడీలకు సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత డెడ్ బాడీలను ఆ మహిళ కుటుంబానికి అప్పగించారు. వారికి కత్తితో చేసిన గాయాలను పోలీసులు గుర్తించారు.
కాగా, రాజ్ కుమార్‌కు బుధవారం సర్జరీ చేశారని పోలీసులు తెలిపారు. ఆయన హెల్త్ కండీషన్ ఆధారంగా అతడిని దర్యాప్తు చేస్తామని వివరించారు. ఆయన స్కూల్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్‌లో ఆదివారం రాజ్ కుమార్ తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 గంటల ప్రాంతంలో మెస్సేజీ పెట్టాడు. తాను ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిట్టు మెస్సేజీ పెట్టినట్టు పోలీసులు తెలిపారు.