‘ఢిల్లీ రాబిన్ హుడ్’.. ఖరీదైన ఇళ్లల్లో చోరీ చేసి.. కొంత పేదలకు పంచి పెట్టే అరుదైన దొంగ.. అరెస్టు

By Mahesh KFirst Published Aug 22, 2022, 8:13 PM IST
Highlights

ఢిల్లీలో ఖరీదైన ఇళ్లల్లో దొంగతనాలు చేసి అందులో కొంత పేదలకు పంచి పెట్టే ఓ దొంగను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పేదలకు కొంత పంచిపెట్టడం ద్వారా వారు ఆయన పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సహకరించేవారు.

న్యూఢిల్లీ: ఇదేదో సినిమా కాదు. అలాగని, రాబిన్ హుడ్ పాత్ర కూడా కాదు. ఢిల్లీలో ఓ పేరు మోసిన దొంగ వివరాలు. ఆయన కేవలం ఖరీదైన, విలాసవంతమైన ఇళ్లను చోరీ చేయడానికి ఎంచుకుంటాడు. చాకచక్యంగా డబ్బు, నగలు దొంగిలిస్తాడు. అందులో కొంత పేదలకు పంచిపెడతాడు. అందుకే చాలా మంది ఆ దొంగకు మద్దతు పలుకుతుంటారు. పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు ఆ దొంగకు చేరవేస్తుంటారు. అందుకే ఆయన పోలీసులకు చిక్కడం చాలా కష్టమైంది. కానీ, ఎట్టకేలకు ఓ ఎర వేసి ప్రత్యేక పోలీసు బృందం పట్టుకోగలిగింది. ఆ దొంగను పట్టుకున్న తర్వాత ఢిల్లీ పోలీసులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

27 ఏళ్ల వసీం అక్రమ్ ఈ దొంగతనాలు చేస్తున్నాడు. ఆయన ఒక్కడే కాదు. ఆయనకు ఒక గ్యాంగ్ ఉన్నది. 25 మంది దొంగలకు ఈయన లీడర్. వసీం అక్రమ్‌ను లంబూ అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన ఢిల్లీలోని పోష్ ఏరియాల్లోని ఇళ్లల్లో దొంగతనాలు చేస్తుంటాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. డబ్బు,  నగలు దోచేవాడని వివరించారు. అందులో కొన్ని (అన్ని కాదు) పేదలకు ఇచ్చే వాడని చెప్పారు. 

ఈ విధానం వల్ల ఆయనకు చాలా మంది అనుచరులు తయారు అయ్యారు. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారని పోలీసులు వివరించారు. వీరే పోలీసుల కదలికలను ఆ దొంగకు చేరవేసేవారు. తద్వార వసీం అక్రమ్‌ను కాపాడుకునేవారు. వీరి సమాచారం అందగానే వసీం అక్రమ్ అక్కడి నుంచి పరారయ్యేవాడని ఢిల్లీ పోలీసులు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 

ఈ దొంగ పలు నేరాలు కూడా చేశాడు. రౌడీ షీటర్‌గా హిస్టరీ ఉన్నది. తన ఆశ్రయాలను తరుచూ మారుస్తుండేవాడు. రాాష్ట్రాలనూ దాటేసి వెళ్తూ ఉండేవాడు. 

వసీం అక్రమ్‌పై 160 నేరాలు నమోదయ్యాయని పోలీసులు వివరించారు. ఇందులో దొంగతనాలు, హత్యా యత్నాలు, రేప్‌ కూడా ఉన్నాయి. వసీం అక్రమ్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక సెల్ పని చేసింది. ఎట్టకేలకు శుక్రవారం ఆ దొంగను పోలీసులు పట్టుకున్నారు.

శివ కుమార్ సారథ్యంలోని పోలీసు బృందం వసీం అక్రమ్‌ను పట్టుకోవడానికి ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఓ ట్రాప్ వేశారు. వసీం అక్రమ్ పోలీసులకు అక్కడే చిక్కాడు. వసీం అక్రమ్ నుంచి ఒక సింగిల్ షాట్ పిస్టల్, 3 లైవ్ కార్ట్‌రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

click me!