ప్రధానిని కావాలని రాలేదు: గుజరాత్ పర్యటనలో కేజ్రీవాల్.. కానీ, ఆప్ 2024 ప్లాన్ అమలు ప్రారంభం!

By Mahesh KFirst Published Aug 22, 2022, 5:45 PM IST
Highlights

తాను గుజరాత్‌కు ప్రధానిని కావాలని రాలేదని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అదే విధంగా కొన్ని ఆరోగ్య, విద్య రంగంలో మార్పులకు హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగానే 2024 ఎన్నికల కోసం ఆప్ వ్యూహంపై చర్చ జరుగుతున్నది. ఆయన జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కొన్ని కీలక విషయాలు చర్చిద్దాం.

అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో బీజేపీని ఓడించే లక్ష్యంతో అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో తరచూ పర్యటనలు చేస్తున్నారు. కేవలం నెల వ్యవధిలో ఐదో సారి ఆయన పర్యటిస్తున్నారు. ఈ రోజు తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో రాష్ట్ర ప్రజల మనసు గెలుచుకోవడానికి తన వంతు ప్రయత్నం చేశారు. ప్రధాని మోడీని నేరుగా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. తాను ప్రధానమంత్రిని కావడానికి ఇక్కడకు రాలేదని వివరించారు. అయితే, ఆయనపై నేరుగా విమర్శలు చేసి నువ్వా నేనా అనే పోటీకి మాత్రం ఆయన తెర లేపలేదు.

తమకు అలాంటి పదవుల కోసం ఇక్కడకు రాలేదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అయితే, దేశాన్ని నెంబర్ వన్ చేయాలనే తాను కోరుకుంటున్నట్టు వివరించారు. సోమవారం తన పర్యటనలో ఆయనకు గట్టి ప్రశ్న ఎదురైంది. తాను ప్రధాని కావాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇందుకు తాను కాదని సమాధానం చెబుతూ జాతీయవాదాన్ని నిలబెట్టే విధంగా మాట్లాడారు. తాను ప్రధాని కావాలని ఇక్కడకు రాలేదని, కానీ, దేశాన్ని నెంబర్ వన్ చేయాలనే ఇక్కడకు వచ్చినట్టు వివరణ ఇచ్చారు. అలాగే, కొన్ని ఆరోగ్య, విద్యా రంగంపై హామీలు ఇచ్చారు. ఈ ఏడాదిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

2024 టార్గెట్‌గా మేక్ ఇండియా నెంబర్ 1: 

2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టిన కొందరు సభ్యులు కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాక్ టు బ్యాక్ విజయాలతో పార్టీని సుస్థిరం చేసుకుంది. 2014లో ఈ పార్టీని జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని అరవింద్ కేజ్రీవాల్ భావించారు. ఇందులో భాగంగానే ఆయన అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర  మోడీతో నేరుగా వారణాసి నుంచి తలపడి భంగపడ్డారు. దీంతో ఒక అడుగు వెనక్కి వేసినా.. ఇప్పుడు మరింత జాగ్రత్తగా పక్కా ప్లాన్‌తో జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు. 

పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్న ఆప్ పంజాబ్‌ను అద్భుతంగా కైవసం చేసుకుంది. గోవాలోనూ మెరిసింది. ఈ ఊపు మీదే ఈ ఏడాది తొలినాళ్లలో రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ క్యాంపెయిన్‌ను కేజ్రీవాల్ చేపట్టారు.

తొలినాళ్లలో ప్రధాని మోడీతో నేరుగా ఢీకొట్టాలని ప్రయత్నించిన అరవింద్ కేజ్రీవాల్ ఆ తర్వాత తన స్ట్రాటజీ మార్చుకుంటూ వచ్చారు. గతంలో మోడీని డైరెక్ట్‌గా కొవార్డ్ అని, సైకోపాత్ అని విరుచుకుపడ్డ కేజ్రీవాల్ ఇప్పుడు తన పంథా మార్చుకుని ఆయనపై నేరుగా వ్యాఖ్యలను తగ్గించారు.

ఇప్పుడు కూడా ఆప్ బీజేపీతో బలంగా తలపడుతున్నది. కానీ, మోడీని టార్గెట్ చేసి కాదు.. పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నది. బీజేపీ తీసుకుంటున్న చర్యలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళుతునున్నది.

ఢిల్లీలో లిక్కర్ పాలసీ కేంద్రంగా సాగుతున్న దర్యాప్తులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఈడీ కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేజ్రీవాల్ ఈ రోజు గుజరాత్‌లో మాట్లాడుతూ.. గుజరాత్‌లో తమను కట్టడి చేయాలనే ఉద్దేశంతో మాత్రమే సీబీఐని ఆప్ నేతలపై ప్రయోగిస్తున్నదని కేజ్రీవాల్ అన్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో సిసోడియాను అరెస్టు చేస్తారేమోనని తెలిపారు. ఏమో.. తనను కూడా అరెస్టు చేయవచ్చని వివరించారు. మనీష్ సిసోడియాను వెంటబెట్టుకుని మరీ ఈ పర్యటన చేయడం గమనార్హం.

కాగా, ఇప్పటికే 2024 ఎన్నికల లక్ష్యంగా కేజ్రీవాల్ తన ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ప్రారంభించినట్టు అర్థం అవుతున్నది. జాతీయవాదం, మతం ఆధారిత ఓటర్ బేస్‌ను ఏమాత్రం కోల్పోకుండా.. ఆయన మేక్ ఇండియా నెంబర్ 1 అనే క్యాంపెయిన్ ప్రారంభించారు. ఢిల్లీ స్కూల్స్, హాస్పిటల్స్‌లో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులనూ ఆయన తన భావి క్యాంపెయిన్‌లకు వినియోగించుకుంటారని తెలుస్తున్నది.

click me!