
Delhi Rains : శుక్రవారం ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దేశ రాజధాని డిల్లీలో బీభత్సం సృష్టించింది. బలంగా గాలులు వీయడంతో చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్ లు విరిగిపడ్డాయి. ఇలా ఢిల్లీలోని జాఫర్‌పూర్ కలా ప్రాంతంలో ఒక చెట్టు ఇంటి మీద పడి ముగ్గురు పిల్లలతో సహా నలుగురు చనిపోయారు.
ఢిల్లీ పోలీసుల ప్రకారం... ద్వారకాలోని ఖర్ఖరీ నహర్ గ్రామంలో 26 ఏళ్ల జ్యోతి తన భర్త అజయ్, ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లో ఉండగా ఘోరం జరిగింది. ఈ ఇంటిపక్కనే ఉన్న ఒక పెద్ద వేప చెట్టు ఈదురుగాలులకు విరిగి ఈ ఇంటిపై పడింది. దీంతో జ్యోతితో పాటు ముగ్గురు పిల్లలు చనిపోయారు. ఈ ప్రమాదంలో అజయ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
భారీ వర్షం తర్వాత డిల్లీలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యారు... రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. వాతావరణ శాఖ ముందే వర్షం, గాలుల హెచ్చరిక జారీ చేసింది. గురువారం రాత్రి నుంచే డిల్లీలో వాతావరణంలో మార్పు కనిపించింది. అర్ధరాత్రి తర్వాత గాలులు, తుఫానుతో పాటు వర్షం మొదలైంది. గాలుల వేగం గంటకు 78 కి.మీ.లకు చేరుకుంది.
ఢిల్లీ సమీపంలోని నోయిడా, ఘజియాబాద్‌లలో కూడా వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఇక్కడ వర్షం, గాలులతో పాటు తుఫాను వచ్చింది.ఇన్నిరోజులు ఉదయం 7 గంటల నుంచి ఎండ తీవ్రంగా ఉండేది... కానీ శుక్రవారం ఇప్పటివరకు వరకు ఎండ లేదు. వాతావరణ శాఖ ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లకు తుఫాను హెచ్చరిక జారీ చేసింది.