తల్లి పిచ్చిది.. తండ్రి మిస్సింగ్.. ఆకలితో ముగ్గురు చిన్నారులు మృతి

By Ramya news teamFirst Published Jul 26, 2018, 12:30 PM IST
Highlights

వారు చనిపోయారనే వార్త డాక్టర్ ఆ తల్లికి చెబుతుంటే.. ఆ తల్లి మాత్రం ఆకలిగా ఉంది భోజనం పెట్టమని అడగటం గమనార్హం.

తల్లికి మతిస్థిమితంగా సరిగాలేదు..తండ్రేమో పనికోసం వెళ్తున్నానని చెప్పి కనిపించకుండా పోయాడు. కొత్త ప్రదేశం. ముగ్గురు చిన్నారులకు 8రోజుల పాటు ఆహారం లేదు. ఆకలికి అలమటించి చివరుకు మృత్యువాతపడ్డారు. ఈ దారుణ సంఘటన దేశరాజధాని దిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల బతుకు తెరువు కోసం దిల్లీకి వచ్చింది. ఆ కుటుంబ పెద్ద రిక్షా నడుపుతూ జీవనం సాగించేవాడు. అనుకోకుండా తన రిక్షా దొంగతనం జరగడంతో.. కుటుంబంతో కలిసి దిల్లీ చేరుకున్నాడు. పని వెతుక్కొని తిరిగి ఇంటికి వస్తానని చెప్పి వెళ్లాడు. వారం రోజులు గడిచినా రాలేదు.

భార్యకేమో కొద్దిగా మతిస్థిమితం సరిగా లేదు. 2,6,8 ఏళ్ల వయసుగల ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వారికి. ఒక గుడిసెలో ముగ్గురు పిల్లలతో ఆ పిచ్చి తల్లి వారం రోజులు గడిపేసింది. మంగళవారం ఒకరి సహాయంతో ముగ్గురు పిల్లలకు ఆరోగ్యం సరిగాలేదని ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చింది.

కానీ అప్పటికే ఆ ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారు చనిపోయారనే వార్త డాక్టర్ ఆ తల్లికి చెబుతుంటే.. ఆ తల్లి మాత్రం ఆకలిగా ఉంది భోజనం పెట్టమని అడగటం గమనార్హం.

8రోజులపాటు ఎలాంటి ఆహారం అందకపోవడం, మురికివాడలో ఉండటంతో డయేరియా కూడా సోకినట్లు అధికారులు గుర్తించారు. కాగా.. ఇప్పుడు ఈ ఘటన రాజకీయమయ్యింది. ఆప్ ప్రభుత్వం చేతగాని తనం వలనే ముగ్గురు పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

click me!