
Indian mangoes: ఈ సీజన్‌లో అమెరికాకు మన మామిడి పండ్లను ఎగుమతి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన ట్రేడ్ ఒప్పందాల్లో భాగంగా భారత్ లో పండిన మామిడి పండ్లపై విధించిన నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది. దీంతో భారత్ లో పండే మామిడి, దానిమ్మ పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమం అయింది. ఈ సీజన్ లో పండే మామిడి పండ్ల ఎగుమతికి సంబంధించి ఇరు దేశాల మధ్య జరిగిన ట్రేడ్ ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. ఈ క్రమంలోనే మామిడి పండ్ల దిగుమతికి యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యుఎస్‌డీఎ) ఒకే చెప్పింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై విధించిన పరిమితుల కారణంగా రేడియేషన్ సదుపాయాన్ని తనిఖీ చేయడానికి USDA ఇన్‌స్పెక్టర్‌లు భారతదేశాన్ని సందర్శించలేకపోయినందున భారతీయ మామిడి పండ్ల దిగుమతిపై 2020 నుంచి పరిమితులు విధించింది అమెరికా.
అయితే, గత నవంబర్ 23న (2021)న అమెరికా, భారత్ దేశాల మధ్య ట్రేడ్ పాలసీ ఫోరమ్ (TPF) సమావేశం జరిగింది. ఈ ఒప్పందాల ప్రకారం భారత్ లో పండిన మామిడి పండ్ల దిగుమతులపై ఉన్న పరిమితులను అమెరికా ఎత్తివేసింది. దీంతో భారత్ లో పండే మామిడి, దానిమ్మ పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమం అయింది. అయితే, ఈ సమయంలో భారత్ కొన్నింటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అమెరికా నుంచి చెర్రీ పండ్లను, అల్ఫాల్ఫా పశుగ్రాసాన్ని, పంది మాంసాన్ని భారత్ లోకి దిగుమతి చేసుకోనున్నారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను పరస్పరం ఇచ్చుపుచ్చుకునే (“2 Vs 2 Agri market access issues”) పద్ధతిలో ఈ ఒప్పందం జరిగినట్టు ఇరువర్గాలు పేర్కొన్నాయి.
ఇక ప్రస్తుతం అమెరికా, భారత్ ల మధ్య కుదిరిన వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను పరస్పరం ఇచ్చుపుచ్చుకునే పద్దతిలో.. భారత్ పండే మామిడి పండ్లను ఈ సీజన్ నుంచే ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒకే చెప్పింది. మామిడి ఎగుమతులు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయని సమాచారం. ఇక దానిమ్మ పండ్ల ఎగుమతి ఏప్రిల్ నుంచి మొదలు కానుంది. అయితే, అమెరికా నుంచి చెర్రీ పండ్లను, అల్ఫాల్ఫా పశుగ్రాసాన్ని, పంది మాంసాన్ని ఏప్రిల్ నుంచి దిగుమతి చేసుకోనున్నారు. 2017-18లో భారతదేశం 800 మెట్రిక్ టన్నుల (MTs) మామిడిని USAకి ఎగుమతి చేసింది. ఈ ఎగుమతుల విలువ 2.75 మిలియన్ డాలర్లు అని అంచనా. 2018-19లో 3.63 మిలియన్ల విలువ కలిగిన.. 951 MT మామిడిపండ్లు USAకి ఎగుమతి చేయబడ్డాయి. 2019-20లో USAకి 4.35 మిలియన్ డాలర్ల విలువచేసే 1,095 మిలియన్ టన్నుల మామిడి పండ్లు ఎగుమతి చేయబడ్డాయి. ప్రస్తుతం ఏడాది ఎగుమతులు కొత్త రికార్డులు సృష్టించే అవకాశముందని వాణిజ్య నిపుణులు పేర్కొంటున్నారు.
భారత్ నుంచి అమెరికాకు మామిడి ఎగుమతులకు అనుమతులు లభించడంతో మామిడి రైతులు లాభం చేకూరనుంది. ఎందుకంటే భారత్ లో కొన్ని ప్రాంతాల్లో మే, జూన్ నెలల్లో మామిడి పంట చేతికి వస్తుండగా, దేశీయంగా అమ్మకాలు ఊపందుకోవడం లేదు. దీంతో మామిడి రైతులు కొంత నష్ట పోతున్నారు. అయితే అమెరికాకు మామిడి ఎగుమతులతో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చని రైతులు, ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా మామిడి ఉత్పత్తి అధికంగా ఉన్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర మామిడి రైతులు మేలు జరగనుంది.