19 ఏళ్ల రికార్డు బద్దలు: న్యూఢిల్లీలో దంచికొట్టిన వర్షం, జనజీవనం అస్తవ్యస్తం

By narsimha lodeFirst Published Sep 1, 2021, 5:00 PM IST
Highlights


న్యూఢిల్లీలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. 19 ఏళ్లలో నమోదు కాని వర్షపాతం నమోదు కావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు  తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. గత 19 ఏళ్లలో  నమోదు కాని రికార్డు స్థాయి వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది.  న్యూఢిల్లీలో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి ప్రాంతంలో  రికార్డుస్థాయిలో  వర్షపాతం నమోదైంది.

న్యూఢిల్లీలోని వీర్‌సింగ్ మార్గ్‌లో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో రోడ్లు వరద కాలువలను తలపిస్తున్నాయి. ప్రముఖులు ప్రయాణించే  7 రేస్ కోర్స్ రోడ్డులో కూడా ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు జన్‌పథ్ మార్గ్‌లో భారీ చెట్టు కూలిపోయింది. చెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. 

దౌవ్‌లాఖాన్ అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.వీవీఐపీలు తిరిగే 7 రేస్ కోర్స్ రహదారిపై భారీ చెట్లు నేలకొరిగాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీ గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్ వేపై భారీ వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 

లోధి రోడ్డు, పాలెం , ఆయన్‌ నగర్‌ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌ పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో సబ్‌వేలు కూడా నీట మునిగాయి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రానున్న 24 గంటల్లో ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.


 

click me!