సీనియర్ సిటిజన్ల 12ఏళ్ల న్యాయపోరాటం.. ‘సుప్రీం’ విజయం.. ‘ట్విన్ టవర్స్ కూల్చాల్సిందే’

By telugu teamFirst Published Sep 1, 2021, 4:57 PM IST
Highlights

15 టవర్ల నివాసులకు ఇబ్బందిగా మారనున్న 40 అంతస్తుల ట్విన్ టవర్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నోయిడాకు చెందిన నలుగురు సీనియర్ సిటిజన్లు 12ఏళ్లు న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు విజయం పొందారు. రాజీపడకుండా చేసిన ఈ పోరాటానికి కొన్నిసార్లు నివాసుల నుంచి డొనేషన్లూ స్వీకరించాల్సి వచ్చిందని, ప్రతి హియరింగ్‌కు తప్పకుండా ఆ నలుగురిలో కనీసం ఇద్దరైనా హాజరయ్యేవారని స్థానికులు చెబుతున్నారు. మంగళవారం నాటి ఆదేశాల్లో ఆ ట్విన్ టవర్‌లను కూల్చాల్సిందేనని సుప్రీంకోర్టు రియల్ ఎస్టేట్ కంపెనీకి స్పష్టం చేసింది.
 

న్యూఢిల్లీ: నోయిడాకు చెందిన సీనియర్ సిటిజన్ల న్యాయపోరాటం ఆదర్శంగా నిలిచింది. 12ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని అలుపెరగకుండా పోరాడి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీని మోకాళ్లపై కూర్చోబెట్టారు. రిటైర్‌మెంట్ తీసుకున్నవారేగా.. మహా అయితే, ఏడాది లేదా మరో ఏడాది పోరాడుతారేమోనని ఆ కంపెనీ వారిని తక్కువ అంచనా వేసి తప్పులో కాలేసింది. న్యాయాన్ని పట్టుకుని వేలాడి ఎట్టకేలకు విజయం సంపాదించుకున్నారా వయోధికులు. ఇప్పుడ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోయిడాలోని సూపర్ టెక్ కంపెనీ తాము కడుతున్న 40 అంతస్తుల రెండు టవర్‌లను స్వయంగా కూల్చాల్సిన దుస్థితికి చేరుకుంది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన నోయిడాలోని ఎమెరాల్డ్ కోర్టులోని సెక్టార్ 93 నివాసులు రియల్ ఎస్టేట్ గ్రూప్ సూపర్ టెక్ కంపెనీపై న్యాయపోరాటం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెండు భారీ బిల్డింగ్‌లను ఈ గ్రూప్ అక్కడ నిర్మిస్తున్నది. ఇది వెంటిలేషన్, సన్‌లైట్ సమస్యలను తెచ్చి పెడుతున్నది. అంతేకాక, కనీసం 15 టవర్‌ల నివాసులకు అత్యవసర పరిస్థితులను కల్పించే ముప్పు తెస్తున్నది. కాబట్టి, ఎలాగైనా అక్రమంగా నిర్మిస్తున్న ఈ ట్విన్ టవర్‌ల నిర్మాణాన్ని అడ్డుకోవాలని సీఐఎస్ఎఫ్ రిటైర్డ్ డీఐజీ, డీఆర్‌డీవో మాజీ అధికారి, టెలికాండిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సహా ఇంకొందరు నిశ్చయించుకున్నారు. ఇందులో యూబీఎస్ తియోతియా(79), ఎస్ శర్మ(74), రవి బజాజ్(65), ఎంకే జైన్(59)లు కృతనిశ్చయంతో పోరాడారు.

వీరంతా ఒక కోర్ లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అలహాబాద్‌ హైకోర్టులో కేసు విచారణకు రెగ్యులర్‌గా హాజరయ్యేవారు. ఈ నలుగురిలో కనీసం ఇద్దరైనా విచారణకు హాజరయ్యేవారు. ఆధారాలు, సమాచార సేకరణలోనూ ఈ నలుగురు కీలకపాత్ర నిర్వహించారు. డబ్బుల కోసం ఒక్కోసారి డోర్ టు డోర్ వెళ్లి డొనేషన్లూ తీసుకోవాల్సి వచ్చింది. అయినా, వెనుకడుగు వేయలేదు. అలహాబాద్ హైకోర్టు ఆ ట్విన్ టవర్లను కూల్చాల్సిందేనని ఆదేశించింది. స్థానిక అధికారులతో కుమ్మక్కై నిర్మాణాలు చేపడుతున్నారని మొట్టికాయలు వేసింది. దీంతో ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టూ మంగళవారం అదే తీర్పును ఎత్తిపట్టింది. దీంతో ఆ కాలనీ వాసుల ఆనందోత్సహాలకు అవధుల్లేకుండా పోయాయి. 12ఏళ్లపాటు చేసిన సుదీర్ఘ న్యాయపోరాటంలో గెలుపు లభించడం వారిని ఆనంద డోలికల్లో ముంచెత్తుతున్నది.

click me!