‘చీర కట్టుకుని వస్తే నో ఎంట్రీ’ వార్త నిజమేనా? రెస్టారెంట్ సిబ్బంది ఏం చెబుతున్నారంటే..

By telugu teamFirst Published Sep 23, 2021, 6:11 PM IST
Highlights

చీరకట్టుకుని వచ్చారని ఓ మహిళను రెస్టారెంట్‌లోకి అనుమతించలేదన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. చీరకట్టు తమ డ్రెస్ కోడ్‌లో భాగంగా లేదని, వెంటనే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోవాలని పేర్కొంటున్న ఓ వీడియోను పోస్టు చేస్తూ సదరు మహిళా సోషల్ మీడియలో పోస్టు చేశారు. దీనిపై ఆ రెస్టారెంట్ అక్విలా స్పందించింది. తాము భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తామని, అందుకు సంబంధించిన వస్త్రధారణనూ గౌరవిస్తామని, కానీ, సదరు మహిళ తమ సిబ్బందిపై దాడికి దిగారని, అందుకే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించినట్టు పేర్కొంది.

న్యూఢిల్లీ: చీర(Saree) కట్టుకుని వస్తే తమ రెస్టారెంట్‌లోకి అనుమతించబోమని ఢిల్లీలోని ఓ రెస్టారెంట్(delhi restaurant).. మహిళను తిరస్కరించారన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ మహిళతో రెస్టారెంట్ సిబ్బంది వాగ్వాదానికి దిగడం, చీర కట్టుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఎంట్రీని తిరస్కరిస్తున్నట్టు ఓ వీడియో వివరిస్తున్నది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భారత సంప్రదాయంగా చీరకట్టు అంతర్భాగమని, అలాంటి చీరకట్టును తిరస్కరించడమేంటని విమర్శలు వచ్చాయి. అయితే, దీనిపై ఢిల్లీలోని అక్విలా(aquila) రెస్టారెంట్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.

తమ రెస్టారెంట్ చీరకట్టుకు వ్యతిరేకం కాదని, ఇది వరకు చాలా సార్లు చీరకట్టుకుని వచ్చినవారున్నారని చెబుతూ అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలనూ షేర్ చేసింది. ‘గతంలో సంప్రదాయ దుస్తులు ధరించినవారూ మా రెస్టారెంట్‌లోకి వచ్చారు. ఈ వ్యవహారంపై పారదర్శకంగా ఉండటానికి ఆ చిత్రాలను పేర్కొంటున్నాం. భారత సంప్రదాయాన్ని మేం గౌరవిస్తాం’ అని వివరించింది. అనంతరం, తాజా వివాదాన్ని ప్రస్తావించింది. ‘ఓ గెస్టు      మా రెస్టారెంట్‌కు వచ్చారు. ఆమె పేరుపై రిజర్వేషన్‌లేమీ లేకపోవడంతో కాసేపు బయటే వేచి ఉండాలని చెప్పాం. ఆమెను ఎక్కడ కూర్చోబెట్టాలా? అని మేం అంతర్గతంగా డిస్కస్ చేశాం. ఇదే సమయంలో ఆమె రెస్టారెంట్‌లోకి ఎంటర్ అయ్యారు. మా సిబ్బందిని దూషించారు. తర్వాత మా మేనేజర్‌పై దాడి చేశారు. ఆ గెస్ట్ మా మేనేజర్ చెంపపై కొట్టారు’ అని పేర్కొంది.

ఆ పరిస్థితులను కంట్రోల్ చేయడానికే తమ ఉద్యోగి ఒకరు ఆమెను బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారని యాజమన్యాం తెలిపింది.. అందులో భాగంగానే తమ డ్రెస్ కోడ్‌లో చీరకట్టుకు అనుమతి లేదని పేర్కొన్నారని వివరించింది. కాగా, తాను ఎవరిపైనా దాడికి దిగలేదని, ఆ వీడియోలోనూ తాను ఎవ్వరినీ నెట్టినట్టు లేదని గెస్ట్ అనితా చౌదరి అన్నారు. చీరకట్టు కారణంగా తనను ఆ రెస్టారెంట్‌లోకి రానివ్వలేదని అనితా చౌదరి ఆరోపించారు. ఓ వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

click me!