
పేదవారిని ఆసుపత్రిలోకి రానియని కార్పోరేట్ ఆసుపత్రి.. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా దొరకని వైద్యం ఇలాంటి వార్తలు మనకు కొత్త కాదు. కానీ ఢిల్లీలో ఓ దారుణం జరిగింది. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడేందుకు బలిదానానికి సిద్ధమయ్యే ఓ పోలీస్ అధికారికి ఎక్కడా వైద్యం దొరక్కపోవడంతో ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో రాజ్‌వీర్ సింగ్ (39) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ద్వారకలో నివాసిస్తున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా సెలవులో ఉన్న ఆయన శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దీంతో కుటుంబసభ్యులు అంబులెన్స్‌ను ఇంటికి పిలిపించి దగ్గరలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆయనను హాస్పిటల్‌లోకి చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించారు.
ఆ తర్వాత మరో రెండు ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఇదే సమాధానం వచ్చింది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్‌వీర్ సింగ్ అంబులెన్స్‌లో ఉన్న ఓ వస్త్రాన్ని మెడకు బిగించుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడికి తల్లిదండ్రులు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రాజ్‌వీర్ సింగ్ ఆత్మహత్య వ్యవహారంతో పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై స్పందించిన డీసీపీ బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదే సమయంలో ఆ ఆస్పత్రులు ఆయనను ఎందుకు చేర్చుకునేందుకు నిరాకరించాయనే అంశంపైనా దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
అయితే కరోనా భయంతోనే ఆస్పత్రులు అతడిని చేర్చుకునేందుకు నిరాకరించాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ సకాలంలో వైద్యం అందివుంటే రాజ్‌వీర్ ప్రాణాలతో వుండేవారని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.