అజిత్ ధోవల్‌ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. ఇంటి వద్ద రెక్కీ, భద్రత కట్టుదిట్టం

By Siva KodatiFirst Published Feb 13, 2021, 6:44 PM IST
Highlights

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నినట్లు తెలిసింది. ఆయన ఇంటిపై రెక్కి నిర్వహించినట్లు పోలీసుల అదుపులో ఉన్న ఓ ఉగ్రవాది బయటపెట్టాడు. దీంతో ధోవల్‌ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.   

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నినట్లు తెలిసింది. ఆయన ఇంటిపై రెక్కి నిర్వహించినట్లు పోలీసుల అదుపులో ఉన్న ఓ ఉగ్రవాది బయటపెట్టాడు. దీంతో ధోవల్‌ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.   

జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన హిదాయత్‌ ఉల్లా మాలిక్‌ అనే ఉగ్రవాదిని ఈ నెల 6న జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. అయితే విచారణలో అతని వద్ద నుంచి కీలక విషయాలు రాబట్టారు.

పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఆదేశాల మేరకు 2019 మే నెలలో ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ భవన్‌, ఢోవల్ నివాసంతో పాటు ప్రముఖులు ఉండే ప్రాంతాల్లో తాను రెక్కీ నిర్వహించానని మాలిక్‌ అంగీకరించినట్లుగా కథనాలు వస్తున్నాయి.

దీంతో పాటు సాంబా సరిహద్దుల్లోనూ తాను రెక్కీ చేపట్టానని, తనతో పాటు మరికొందరు ఉగ్రవాదులు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని మాలిక్‌ వెల్లడించాడు. మాలిక్‌ సమాచారంతో అప్రమత్తమైన కశ్మీర్‌ పోలీస్ వర్గాలు.. ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ధోవల్‌ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

కశ్మీర్‌‌ వ్యవహారాలతో పాటు దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో కీలకంగా ఉండే అజిత్ ధోవల్ ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు గతంలోనే నిఘా సంస్థలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. 2016లో జరిగిన సర్జికల్‌ స్ట్రైక్స్‌, 2019లో బాలాకోట్‌‌లో జరిగిన వైమానిక దాడులకు ధోవల్ వ్యూహకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 
 

click me!