ప్రఖ్యాత టీవీ ఛానెల్ కి నోటీసులు

First Published Jun 4, 2018, 10:10 AM IST
Highlights

అన్ని అసత్యాలే చూపిస్తున్నారని...

ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కి నోటీసులు జారీ అయ్యాయి. అసత్యాలతో కూడిన విద్వేషపూరిత కథనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారంటూ ఓ ప్రఖ్యాత టీవీ చానెల్‌కు నోటీసులు జారీ అయ్యాయి. దేశరాజధాని ఢిల్లీలోని బవానా పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తోన్న భారతీయులను.. రోహింగ్యాలు, బంగ్లాదేశీలుగా పేర్కొంటూ ఆ చానెల్‌ ఒక కథనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.

 దానిపై ఢిల్లీ మైనారిటీస్‌ కమిషన్‌(డీఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయుల జాతీయతను కించపరిచేలా సాగిన కథనంపై తక్షణమే క్షమాపణలు చెప్పాల్సిందిగా చానెల్‌కు నోటీసులు ఇచ్చింది.

నోయిడా కేంద్రంగా 2007 నుంచి పనిచేస్తోన్న హిందీ న్యూస్‌ చానెల్‌ ‘సుదర్శన్‌ న్యూస్‌’... ఆది నుంచీ వివాదాలకు కేంద్రంగా ఉంటూవస్తోంది. మొన్న మే11న బవానా ప్రాంత వాసులపై ఆ చానెల్‌ చేసిన ప్రోగ్రామ్‌లో స్థానికులను విదేశీయులుగా పేర్కొంది. 

ఇరువర్గాల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా టీవీ ప్రసారాలు చేశారన్న ఆరోపణలపై సుదర్శన్‌ న్యూస్‌ ఎండీ, ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ సురేశ్‌ చౌహంకేను గతేడాది సంభల్‌(ఉత్తరప్రదేశ్‌) పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందే అతనిపై అత్యాచారం, హత్యాయత్నం కేసులున్నాయి. 

తన చానెల్‌లోనే పనిచేసిన ఉద్యోగినిపై చౌహంకే అత్యాచారయత్నం చేశాడని 2016లో నోయిడా పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు.
 

click me!