
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులకు గురువారం నాడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించింది. అభిషేక్ బోయిన్‌పల్లి, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ , సమీర్ మహేంద్రు, బినయ్ బాబులకు కోర్టు బెయిల్ నిరాకరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఈ నెల 9వ తేదీన ఈ బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే ఈ ఐదుగురి బెయిల్ పిటిషన్లపై ఇవాళ తీర్పును వెల్లడిస్తామని కోర్టు ఈ నెల 9వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ కి సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయరాదని ఈడీ న్యాయవాది కోర్టును అభ్యర్ధించారు. దీంతో నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్ బోయిన్ పల్లి, శరత్ చంద్రారెడ్డి, పమీర్ మహేంద్రు, విజయ్ నాయర్లను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ మధ్యం కేసులో దేశ వ్యాప్తంగా అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో సౌత్ లాబీ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పలువురిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశారు. ఇటీవలనే వైసీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ రెడ్డిని దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ కంటే ముందే హైద్రాబాద్ కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు. బుచ్చిబాబు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు గతంలో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేశారు. గత ఏడాది బుచ్చిబాబుకు చెందిన గోరంట్ల అసోసియేట్స్ కార్యాలయంలో దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సోదాల సమయంలో కీలక సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు సేకరించాయి.
: