ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరో అరెస్ట్.. బిజినెస్‌మెన్ గౌతమ్ మల్హోత్రా‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ..

By Sumanth KanukulaFirst Published Feb 8, 2023, 12:16 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరొకరికి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరొకరికి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు, పంజాబ్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని ఒయాసిస్ గ్రూపుతో సంబంధం ఉన్న మల్హోత్రాను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గౌతమ్ మల్హోత్రాను ఢిల్లీ కోర్టులో హాజరుపరచనున్న ఈడీ అధికారులు.. అతడిని కస్టడీకి కోరనున్నారు. మల్హోత్రాకు పంజాబ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మద్యం వ్యాపారంతో సంబంధం ఉందని ఈడీ అధికారులు తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ రూపకల్పణలో గౌతమ్ మల్హోత్రా కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే గౌతమ్‌ మల్హోత్రాపైపై అక్రమ డబ్బును తరలించినట్టుగా కూడా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును మంగళవారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం బుచ్చిబాబును ఢిల్లీకి పిలిపించిన అధికారులు.. అతను విచారణకు సహకరించకపోవడం, ప్రశ్నలను దాటవేయడంతో మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బుచ్చిబాబు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వద్ద గతంలో చార్టర్డ్ అకౌంటెంట్ పనిచేశారు. 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 గత ఏడాది ఆగస్టులో రద్దు చేయబడింది. ఇందులో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో వాటిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐని  కోరారు. దీంతో సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ నుంచి మనీలాండరింగ్‌కు సంబంధించిన అంశాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇక, ఈడీ ఇప్పటి వరకు ఈ కేసులో రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. మల్హోత్రాతో సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేసింది.

click me!