రాహుల్ గాంధీకి ఊరట.. ఆర్డినరీ పాస్‌పోర్టు పొందడానికి ఎన్‌ఓసీ మంజూరు..

By Sumanth KanukulaFirst Published May 26, 2023, 1:45 PM IST
Highlights

 సాధారణ పాస్‌పోర్ట్ జారీకి ఎన్‌ఓసీ కోరుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పాక్షికంగా అనుమతించింది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట లభించింది. సాధారణ పాస్‌పోర్ట్ జారీకి ఎన్‌ఓసీ కోరుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పాక్షికంగా అనుమతించింది. మూడు సంవత్సరాల పాటు సాధారణ పాస్‌పోర్ట్ జారీకి సంబంధించి రాహుల్ గాంధీకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసీ) మంజూరు చేసింది. 

ఇక, రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు పడటంతో తన దౌత్య పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేసిన తర్వాత ఆయన సాధారణ(ఆర్డినరీ) పాస్‌పోర్టు కోసం కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి.. ‘‘నేను మీ దరఖాస్తును పాక్షికంగా అనుమతిస్తున్నాను. 10 సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు’’ అని రాహుల్ గాంధీ తరపు న్యాయవాదికి తెలిపారు. 

ఇక, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఫిర్యాదుదారుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ నిందితునిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్డినరీ పాస్ పోర్టు కోసం రాహుల్ అభ్యర్థనపై లిఖితపూర్వక స్పందన తెలపాలంటూ బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామిని కోర్టు ఆదేశించింది. అయితే సుబ్రమణ్యస్వామి గడువు కోరడంతో కేసు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. తాజాగా నేడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

click me!