జయా జైట్లీకి కోర్టు షాక్, అవినీతి ఆరోపణల కేసులో నాలుగేళ్ల జైలు

By Siva KodatiFirst Published Jul 30, 2020, 6:36 PM IST
Highlights

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీకి ఢిల్లీ కోర్టు ఊహించని షాకిచ్చింది. జయా జైట్లీతో, మరొక ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీకి ఢిల్లీ కోర్టు ఊహించని షాకిచ్చింది. జయా జైట్లీతో సహా మరొక ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది.  2001 నాటి రక్షణ ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రుజువు కావడంతో వీరికి నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది.

ఈ కేసులో దోషులైన జయా జైట్లీ, సమతా పార్టీ మాజీ నేత గోపాల్ పచేర్వాల్, మేజర్ జనరల్ (రిటైర్డ్) ఎస్‌పీ ముర్గయి గురువారం సాయంత్రం 5 గంటలలోగా లొంగిపోవాలని స్పెషల్ సీబీఐ జడ్జి వీరేందర్ భట్ ఆరోపించారు.

దోషుల తరపున వాదనలు వినిపించిన విక్రమ్ పన్వర్... భారత శిక్ష్మా స్మృతి ప్రకారం నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు, అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 9 ప్రకారం అవినీతి నేరారోపణలు రుజువైనట్లు తెలిపారు. ప్రాసిక్యూషన్ సాక్షి నుంచి గోపాల్ పచేర్వాల్ ద్వారా జయా జైట్లీ రూ. 2 లక్షలు తీసుకున్నట్లు కోర్టు గుర్తించింది.

ప్రాసిక్యూషన్ సాక్షికి చెందిన కంపెనీ తయారు చేసే థర్మల్ ఇమేజర్స్‌ను భారత సైన్యం కొనే విధంగా సంబంధిత మంత్రులు, అధికారులపై వ్యక్తిగత పలుకుబడితో ప్రభావం చూపే పనిని పూర్తి చేయడం కోసం ఈ సొమ్మును స్వీకరించినట్లు గుర్తించింది.

అదే విధంగా 2001 జనవరి 4న ముర్గయి ప్రాసిక్యూషన్ సాక్షి నుంచి రూ. 20 వేలు తీసుకునట్లు కోర్టు గుర్తించింది. జయా జైట్లీతో సమావేశం ఏర్పాటు చేశారని, సాక్షికి చెందిన కంపెనీ ఉత్పత్తి చేసిన థర్మల్ ఇమేజర్స్‌కు ఎవాల్యుయేషన్ లెటర్‌ను తీసుకురావడంలో ముర్గయి సహాయపడినట్లు గమనించింది.

ఈ కేసుకు సంబంధించి థర్మల్ ఇమేజర్స్ కొనుగోలులో అవినీతి జరిగినట్లు కోర్టు 2012లో కేసు నమోదు చేసింది. 2001లో ఓ న్యూస్ పోర్టల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ అవినీతి బయటపడింది.

వెస్టెండ్ ఇంటర్నేషనల్ తయారు చేసే థర్మల్ ఇమేజర్స్‌ను కొనడానికి సంబంధించిన వ్యవహారంలో ఈ అవినీతి కేసు నమోదైంది. 2006లో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కంపెనీ ప్రతినిథి శామ్యూల్ ఈ లంచం ఇచ్చినట్లు పేర్కొంది. 
 

click me!