పేరుకు సీఎంని.. ఏం చేయలేకపోతున్నా: ప్రధానితో గోడు వెల్లబోసుకున్న కేజ్రీవాల్

By Siva KodatiFirst Published Apr 23, 2021, 2:30 PM IST
Highlights

ఆక్సిజన్ కొరతతో దేశం తీవ్ర ఇబ్బందులు పడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్రమోడీని కోరారు.

ఆక్సిజన్ కొరతతో దేశం తీవ్ర ఇబ్బందులు పడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్రమోడీని కోరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురాకపోతే మహా విషాదం తప్పదని ఆయన హెచ్చరించారు. శుక్రవారం ప్రధాని మోడీ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. 

కోవిడ్-19 మహమ్మారి కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీలో ఆక్సిజన్ కొరత గురించి వివరించారు. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు.

ఢిల్లీలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు లేవని, అందువల్ల తమకు ఆక్సిజన్ ఇవ్వరా? అని నిలదీశారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల రోగి కొన ఊపిరితో ఉన్నపుడు, ఆ పరిస్థితి గురించి తాను ఎవరితో మాట్లాడాలో చెప్పాలని కేజ్రీవాల్ కోరారు.

Also Read:ఆక్సిజన్ కొరతతో 25 మంది మృతి: వాస్తవం లేదన్న గంగారాం ఆసుపత్రి ఛైర్మెన్,

ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా జరగకుండా ఇతర రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయని... ఆక్సిజన్ రవాణా వాహనాలను కొన్ని రాష్ట్రాలు నిలిపేస్తున్నాయని అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడాలని మోడీని కోరారు. ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 

తాను ముఖ్యమంత్రిని అయినప్పటికీ ఏమీ చేయలేకపోతున్నానని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా నిద్రపట్టడం లేదని.. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా తనను క్షమించాలని కోరారు. ఆక్సిజన్ ప్లాంట్లను సైన్యం స్వాధీనం చేసుకోవాలని విజ్ఙప్తి చేశారు. అదేవిధంగా వ్యాక్సిన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ధరకు అందజేయాలని కోరారు. 
 

click me!